Wednesday, 4 November 2026

బీజేపీ తీర్థం పుచ్చుకున్న హీరోయిన్‌ మాధవీలత

– పార్టీ కండువాను కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి గడ్కరీ
హైదరాబాద్‌, మే5(జ‌నం సాక్షి ) : ప్రముఖ సినీ నటి, హీరోయిన్‌ మాధవీ లత భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం పార్టీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ, నితిన్‌ గట్కరీ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మాధవీలత గత కొద్ది కాలంగా టాలీవుడ్‌లో చెలరేగుతున్న వివాదాలపై తరచూ తన గొంతు వినిపించారు. గతంలో పవన్‌ పార్టీ జనసేన తరపున ప్రచారం సైతం చేస్తానంటూ చెప్పారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాధవీ లత ఫిలిం ఛాంబర్‌ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దికాలంగా మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సైతం హల్‌చల్‌ చేశాయి. అయితే ఆమె అనూహ్యంగా శనివారం బీజేపీలో చేరారు. ఆమెతో పాటు కార్వాన్‌ కాంగ్రెస్‌ నేత అమర్‌ సింగ్‌, కేయూ మాజీ వీసీ వైకుంఠంలు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. చాలా మంది ప్రముఖులు బీజేపీలో చేరడానికి వస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని, ఇది పార్టీ ఎదుగడానికి దోహదపడుతుందన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారిని
స్వాగతిస్తున్నామని, తెలంగాణ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందంటూ వ్యాఖ్యానించారు.