బీసీలంతా ఆత్మగౌరవ పోరాటానికై సిద్ధం కావాలి
– బీసీ నేత ధనుంజయ నాయుడు
హుజూర్ నగర్ నవంబర్ 18 (జనం సాక్షి): బీసీలంతా ఆత్మగౌరవ పోరాటానికై సిద్ధం కావాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన హుజూర్ నగర్ మండల కేంద్రంలో విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ దేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్ల లోను జనాభా దామాషా పద్ధతిలో న్యాయం జరగడం లేదని, బూర్జువా పార్టీలు బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండాల్సిన బీసీలను ఎంపీటీసీ, సర్పంచ్ పదవికి పరిమితం చేస్తున్నారని బీసీలు ఈ విషయాలపై ఆలోచన చేయాలని చైతన్యం కావాలని పార్లమెంట్లో రాజకీయ రిజర్వేషన్ బిల్లు కొరకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు, గిరిజన బంధు పథకాలను ప్రవేశ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని అలాగే బీసీ బంధు కూడా రూపొందించి అమలు చేయాలని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న బీసీలను గుర్తించి వారికి తోడ్పాటు అందించడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని జనాభాలో 56% గా ఉన్న బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు.
బీసీల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బడ్జెట్లో బీసీలకు అధిక నిధులు కేటాయించాలని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాలు నిర్వహించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించి నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు న్యాయం చేయాలని అన్ని కాంట్రాక్ట్ ల లో కూడా బీసీలకు 50% కేటాయించాలని స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకున్న బీసీ యువతకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణసదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీలంతా ఆత్మగౌరవ పోరాటానికై సిద్ధం కావాలి




