బీసీ పోరుబాటకు సిద్ధం కావాలి
– ధూళిపాళ ధనుంజయ నాయుడు
హుజూర్ నగర్ జనవరి 2 (జనంసాక్షి): త్వరలో జరగబోయే దేశ జనగణనలో బీసీ జనగణన చేపట్టేందుకు బిసి మేలుకో- లెక్క తేల్చుకో… అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో జరిగే బీసీ పోరుబాటకు సిద్ధం కావాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం హుజుర్ నగర్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీ కుల గణన చేసి బీసీ పాలసీని ప్రకటించాలని కోరారు. మేం ఎంతో మాకు అంత వాట దక్కాలంటే బీసీ కుల గణనతోనే సాధ్యమవుతుందని కోరారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయమంటే, సాంకేతిక లోపాలు వస్తాయని, కుంటి సాకులు చెప్పడం, అది పచ్చి అబద్ధమని, ఇప్పటికీ స్వాతంత్ర సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్న, దేశం అభివృద్ధికి నోచుకోకపోవడం కారణం, ఇప్పటికీ మెజార్టీ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయాల అభివృద్ధి జరగకపోవడమే కారణమన్నారు. దీనికి మూల కారణం మెజార్టీ ప్రజలైన బీసీల కుల గణన చేయకపోవడమే ప్రధాన కారణం అన్నారు. మెజార్టీ ప్రజల కులగణన చేసి, వారి వాటా ఇవ్వాల్సిందేనని, లేనిపక్షంలో బీసీ మేలుకో లెక్క తెలుసుకో అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో బీసీ పోరుబాట నిర్వహిస్తున్నామని, దీనికి మెజార్టీ ప్రజలు పెద్ద ఎత్తున సమీకరించి, చివరి రోజున లక్ష మందితో హైదరాబాదులో బహిరంగ సభను నిర్వహిస్తామని ఆయన తెలియ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో నాలుగైదు సంవత్సరాల క్రితం బీసీ రుణాలు దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీ రుణాలు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. కుల ఫెడరేషన్ లో నిధులు అంతంత మాత్రం కేటాయించి, అవి ఖర్చు చేయకపోవడం వలన, చేతి వృత్తుదారులు ఆర్థికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటికీ రాష్ట్రంలో అనేకమంది వృత్తిదారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిని ఆదుకోకపోవడం ఇంతకన్నా హేయమైన చర్య మరొకటి లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 11 కుల ఫెడరేషన్ లో అధిక నిధులు కేటాయించి వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ధనుంజయ నాయుడు తెలిపారు.
బీసీ పోరుబాటకు సిద్ధం కావాలి




