జనంసాక్షి, మంథని : నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల్లోని ఆలోచనాపరులకు చరిత్రకారులను చూపించి చరిత్రను తెలిపే బాధ్యత భుజాన వేసుకున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. మంథని పట్టణంలోని రాజగృహ లో ఈ నెల 16న తలపెట్టిన బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ, భూపాలపల్లి జిల్లా యువనాయకులు జక్కు రాకేష్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం కొంతమంది చేతల్లో ఎమ్మెల్యే కబంధ హస్తాల్లో ఉండిపోయి ఉద్యమం ముందుకు సాగలేదన్నారు. మహనీయుల చరిత్ర తెలుసుకోకపోవడం, మహనీయుల స్పూర్తిని ఈ ప్రాంత ప్రజలు పొందలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అనేక ఏండ్లు ఈ నియోజకవర్గంలో అన్నం పెట్టని, అభివృధ్దిచేయని ఒక కుటుంబమే రాజ్యమేలిందన్నారు. మహనీయుల చరిత్రను దాచిపెట్టి ఈ ప్రాంత ప్రజలను అణిచివేసి తమ చెక్కు చేతల్లో పెట్టుకున్న ఎమ్మెల్యే కుటుంబం ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు చరిత్రను చెప్పి ఆ కుటుంబం చేతుల్లో బందీ అయి దయనీయ పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు విముక్తి కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. మహాత్మాజ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బాబు జగ్జీవన్రాం, సర్థార్ సర్వాయి పాపన్న లాంటి అనేక మంది మహనీయుల చరిత్రను తెలియకుండా చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే చరిత్రకారుల విగ్రహాలను నెలకొల్పడం ద్వారానే ఈ సమాజానికి వెలుగులు వస్తాయని, సమాజానికి వెలుగులు రానన్నిరోజులు ఒక్క కుటుంబం చేతుల్లో బంధీలుగానే బతుకాల్సిన దుస్థితి ఉంటుందన్నారు. సమాజ మేల్కొలుపు కోసం మహనీయుల చరిత్రను చాటి చెబుతున్నామని, ఇందులో బాగంగా రాష్ట్రంలోనే మొట్ట మొదటగా బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన బీపీ మండల్ విగ్రహాన్నిమంథనిలో నెలకొల్పు కుంటున్నామని ఆయన తెలిపారు. బీసీ సమాజానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడైన బీపీ మండల్ విగ్రహాన్ని ఈ నెల 16న మంథనిలో బారీ ఎత్తున ఆవిష్కరించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణతో బీసీల్లో ఒక వెలుగులు, ఆలోచన, స్వాతంత్య్రం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణకు మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ వెంకటేష్నేత, బీపీ మండల్ మనుమడు సూరజ్మండల్తో పాటు పలువురు హజరుకానున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున చేపట్టే ఈ విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేసే బాధ్యత బలహీనవర్గాల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉందని, నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, ఆలోచనాపరులు, బీఆర్ఎస్ పార్టీశ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు.




