Thursday, 5 November 2026

బీసీ హక్కులను కాలరాస్తుంటే బీసీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,మంత్రులు టీ, బిస్కెట్లు తింటున్నారా?

బీసీ హక్కులను కాలరాస్తుంటే బీసీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,మంత్రులు టీ, బిస్కెట్లు తింటున్నారా?
ఈ డబ్ల్యూ ఎస్ పై సుప్రీంకోర్టు తీర్పుతో బీసీలకు అన్యాయం.
కేంద్ర.రాష్ట్ర ప్రభుత్వాలు బీపీ మండల్ కమిషన్ సూచించిన సిఫార్సులను అమలు చేయాలి.
బిసి పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 14(జనంసాక్షి):
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అ వుతున్నా రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు అమలు కావడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా బిసి పొలిటికల్ జేఏసీ కన్వీనర్ డి.అరవింద్ చారి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డి.అరవింద్ చారి మాట్లాడుతూ దేశంలో 10శాతం జనాభా లేని అగ్రవర్ణాల పేదల కోసం 10శాతం రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు ఇటీవల సానుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ హక్కులను కాలరాస్తుంటే బీసీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,మంత్రులు పార్లమెంటు లో, అసెంబ్లీలో లో టీ, బిస్కెట్లు తింటున్నారా? అని ప్రశ్నించారు.ఓబీసీ వర్గానికి చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు. ఎంపీలు,ప్రజాప్రతినిధులు నోరు విప్పి ఖండించక పోవడం బీసీల దురదృష్టకర మన్నారు.గతంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలన్నది. మరి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తీర్పును అనుకూలంగా ఇవ్వడంతో ప్రస్తుతం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగిందని అన్నారు.సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ జనాభాలో ఓ బి సి 52 శాతం పైగా ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27శాతం రిజర్వేషన్ అమలవుతున్నాయి. దేశ సంపదను సృష్టించే ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు బిపి మండల్ ద్వారా అమలయ్యాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎలక్షన్ సమయంలో 18 శాతానికి కుదించి బీసీలు సర్పంచులుగా, ఎంపిటిసిలు గా పోటీ చేసే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీసీ సమాజమంతా గ్రామ గ్రామాన ఏకమై జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బీసీలకు కల్పించేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.పోరాటాల ద్వారానే బీసీల హక్కులు సాధ్యమవు తాయని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు దమ్ముంటే బీపీ మండల్ కమిషన్ సూచించిన సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీసీల హక్కుల కోసం గ్రామ గ్రామాన బహిరంగ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.ఈ సమావేశంలో రాజు, మహేష్, గణేష్, మోహన్,కృష్ణ, మహేష్,వంశీ,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.