వేమనపల్లి,జూన్ 28,(జనంసాక్షి)తారు రోడ్డు.. సీసీ రోడ్డు.. గ్రావెల్ రోడ్డు తెలుసు.. ఇది మాత్రం బురద రోడ్డు..! వాహనంపై మాత్రమే కాదు నడిచి వెళ్లినా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే బురదలో జారిపోతారు.లేదా బురద నిండిన గోతుల్లో పడి కాళ్లు, చేతులు విరగ్టొట్టుకోవాల్సిందే.ఈ రహదారిపై గోతులతో ఇబ్బందిపడే వాహన చోదకులకు కాస్త చినుకులు పడితే బురదతో తంటాలే..ఇది వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ ప్రధాన రహదారి దుస్థితి.ధ్వంసమైన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.కానీ కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడం శోచనీయం. నిత్యం ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు ఇదే మార్గంలో ప్రయాణం చేస్తున్న రోడ్డు మరమ్మత్తులపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి మరింత చిత్తడిగా మారి ఇబ్బందికరంగా ఉందని,తాత్కాలిక పనులు చేపట్టినా వర్షం పడితే రహదారి బురదమయంగా మారుతోందని వాపోయారు.వాహనాల రాకపోకలతో గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.ఒకవైపు విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే జంకుతున్నారు.మరోవైపు రైతులు నిత్యావసరాలకు వెళ్లాలంటే ఎక్కడ జారిపడతామని భయపడుతున్నారు. త్వరితగతిన రహదారిలో తాత్కాలిక కంకర నిర్మాణం చేపట్టాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
బురదమయంగా మారిన నీల్వాయి రోడ్డు




