Wednesday, 4 November 2026

బెల్లంపల్లి పట్టణంలో విచ్చలవిడిగా భూ కబ్జాలు.

–

 

 

 

 

 

 

పట్టించుకోని అధికారులు. మామూళ్ళ మత్తులో యంత్రాగం.- అన్ని పార్టీలదీ అదే దారి.
నకిలీ పత్రాలతో కోర్టు నుంచి స్టే. ప్రశ్నించే వారే కరువైయ్యారు.ఫొటో : ఇంక్లైన్ బస్తిలో కబ్జా చేసి తాత్కాలిక కాంపౌండ్ వేసిన కబ్జాదారులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 12, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలో భూ కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నా సంబంధిత యంత్రాగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారిస్తుండటం పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలో సింగరేణి, ప్రభుత్వ, మున్సిపల్ భూములు అని కాకుండా ఏ భూమి కనబడ్డా ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు వారి వారి తహతుకు సంబందించి కబ్జాలు చేసుకుంటు, కబ్జా చేసిన భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ వార్డు, ఈ వార్డు అనే తేడా లేకుండా పట్టణంలోని అన్ని వార్డులోనూ ఇదే తంతు కొనసాగుతుంది. కబ్జాలను అరికట్టాల్సిన యంత్రాంగం మామూళ్ళ మత్తులో జోగుతుండటంతో కబ్జాలపై చర్యలు తీసుకోవడంలో మిన్నకుండి పోతున్నారు. సింగరేణి భూములకు ప్రభుత్వం పట్టాలు ఇస్తామని ప్రకటన జారీ చేయడంతో ఈ కబ్జాలు మరీ పెరిగి పోయాయి.నకిలీ పత్రాలతో కోర్టు స్టే.కబ్జా భూములపై ఏమైనా పిర్యాదులు వస్తే అధికారులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించగానే వెంటనే కబ్జా దారులు నకిలీ పత్రాలు రూపొందించి వాటి ఆధారంగా కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకొని ఆ తర్వాత దర్జాగా కబ్జా భూమిలో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కబ్జా దారులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ కబ్జా భూమి కోర్టు పరిధిలో ఉంది, తాము ఏం చేయలేము అని అధికారులు చేతులెత్తేసి కొట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా దారుల చేతిలో కట్టబెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టణంలో భూ కబ్జాలను నియంత్రించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.