బెస్ట్ ఫ్రెండేగా అని ఫేక్ భర్తగా తీసుకెళితే..

పూణే : తల్లిదండ్రులు చూస్తున్న వివాహ సంబంధాలకు పుల్ స్టాప్ పెట్టాలనుకున్న ఓ యువతి తన స్నేహితుడినే పెళ్లి చేసుకున్నట్లు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పింది. ఆపై తన స్నేహితుడినే భర్తగా పరిచయం చేసింది. ఆ తప్పే ఆ యువతి పాలిట శాపంగా మారి ఉత్తుత్తి భర్త ఆ యువతిపై అత్యాచారం జరిపిన సంఘటన ముంబయిలో జరిగింది.అంతా సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ముంబయికి చెందిన 22 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ చదువుకుంటోంది. ఆ యువతి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాడు. అంత త్వరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి తండ్రి పెళ్లి ప్రయత్నాలను అడ్డుకోవాలనుకొని స్నేహితులతో చర్చించారు. తండ్రి పెళ్లి ప్రయత్నాలు చేయకుండా ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నట్లు సృష్టించమని ఓ స్నేహితుడు సలహా ఇచ్చాడు. అంతే తన స్నేహితుడైన ఓ యువకుడితో పెళ్లి జరిగిందని, అతన్ని భర్తగా తల్లిదండ్రులకు పరిచయం చేసింది. దాంతోపాటు ఓ నకిలీ వివాహ సర్టిఫికెట్ ను కూడా యువతి సృష్టించింది. కాని ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న స్నేహితుడే యువతికి తెలియకుండా తన పెళ్లిని రిజస్టరు చేయడంతోపాటు నిజమైన భర్తలాగా ఆమెపై అత్యాచారం జరిపాడు. యువతి తన పుట్టింటికి వెళ్లగా, ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని స్నేహితుడైన ఉత్తుత్తి భర్త భయపెట్టాడు. వడగామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య జరిగిన ఈ  అత్యాచార ఘటనపై యువతి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 420ల కింద కేసు నమోదు చేసి  సిన్హాఘడ్ రోడ్డు పోలీసులకు బదిలీ చేశారు. అహ్మద్ నగర్ కు చెందిన నిందితుడిపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.