జనం సాక్షి , మంథని :పరిశుద్ధ గ్రంథం బైబిల్ బ్రతుకు బాటను నేర్పిస్తుందని పాస్టర్ వల్లూరి ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఈస్టర్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సీయోను ప్రార్థన మందిరంలో యేసు క్రీస్తు పునరుత్థానం గురించి వాఖ్యోపదేశం చేశారు. యేసుక్రీస్తును సిలువ వేసిన తరువాత మూడవ రోజు ఆదివారం సమాదిలో నుండి లేవడం చరిత్మక ఘట్టమన్నారు. పాపక్షమాపణ కోసమే యేసుక్రీస్తు సిలువ మరణం పొందాడని ఆయన పేర్కొన్నారు. యేసు అంటేనే ప్రేమ అని, ప్రేమ అంటే యేసు అని ఆయనను కొనియాడారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు యేసుక్రీస్తు అనుసరించిన నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే బోదనలు మానవులందరూ అనుసరించదగిన వన్నారు. యేసుక్రీస్తును సిలువకు వేసిన బటులను సైతం ఆయన క్షమించాడని అలాంటి త్యాగమూర్తిని స్మరించుకోవడం శ్రేయస్కరమన్నారు. ప్రతీ రోజు బైబిలు చదవడం ద్వారా సమాజంలో మనం ఎలా బ్రతుకాలో నేర్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఈస్టర్ పండుగను పురస్కరించుకొని సీయోను క్వాయర్ ప్రత్యేక గీతాలను ఆలపించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ వాసాల జాన్, వల్లూరి ప్రభాకర్, సంఘ పెద్దలు అంకరి కుమార్, ఎంకే జోసఫ్, రణవీర్, ప్రసాద్, రమేష్, సదానందం, ప్రేమ్ కుమార్, యోసేపుతో పాటు తదితరులు పాల్గొన్నారు.




