Friday, 6 November 2026

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన. – సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ.

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన.
– సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ.
బెల్లంపల్లి, డిసెంబర్ 9, (జనంసాక్షి )
బొగ్గుగనుల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, బిజెపి ప్రభుత్వనిరంకుశ విధానాలను వ్యతిరేకిచాలని, 11వ వేతన ఒప్పంద సాధన కోసం పోరాటం చేయాలని, సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సింగరేణి కార్మిక సంఘాల జెఏసీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని పై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సివిక్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని బొగ్గు గనులను ప్రైవేటీకరించి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన బిజెపి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను తిప్పి కొట్టి మెరుగైన వేతన ఒప్పందం కోసం పోరాడుదాం అన్నారు. ధరలేమో విపరీతంగా పెంచి సామాన్యుడు జీవించలేని దుర్భర పరిస్థితులను సృష్టించి వేతనాల పెరుగుదలకు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) గైడ్లైన్స్ అడ్డంపెట్టి వేతన ఒప్పందంలో అడ్డంకులు సృష్టిస్తున్న ప్రధానమంత్రి మోడీ చర్యలు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఉదాహరణకి భారతదేశంలో బొగ్గు అవసరాలు పెరిగాయి విద్యుత్ సంస్థలు పెరిగాయి అయినప్పటికీ నరేంద్ర మోడీ లక్ష్యం మాత్రం కార్మికులను బానిసలుగా మార్చి బొగ్గు గనులను అదానీ, అంబానీ, జిందాల్ లాంటి కంపెనీలకు కట్టబెట్టడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నాడన్నారు. బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, సబ్బండ వర్గాల శ్రామికులకు వ్యతిరేకంగానే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకొస్తున్నదన్నారు. ఇప్పటికే దేశంలోని లక్షలాది పరిశ్రమలను మూసివేసి కోట్లాదిమంది బడుగు జీవులను బజారు పాలు చేసి ఇంకా తన దాహం తీరనట్టు దేశంలోనే పెద్ద ప్రభుత్వ రంగసంస్థలైన రైల్వే, విమాన, బ్యాంకింగ్, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు లాంటి అనేక పరిశ్రమల్ని కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మి వేసిందన్నారు. పాశవికపు ఆలోచనలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ విషం చిమ్ముతున్నదని, ఇందులో భాగంగానే కార్మికులకు గత సంవత్సరం జూలై నుంచి అమలు కావాల్సిన 11వ వేతన ఒప్పందాన్ని జరగకుండా అనేక రకాలుగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నదన్నారు. ధరలు ఆకాశంలో రూపాయి పాతాళంలో కూరుకుపోయాయి. కరోనా లాంటి విపత్కర, దుర్భర పరిస్థితుల్లో వేలం పాటలు నిర్వహించి బొగ్గు గనులను అమ్మి వేసిన అతిపెద్ద మోసకారి నరేంద్ర మోడీ తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ కార్మిక రంగాన్ని ఈ దేశంలో బానిసలుగా మార్చడం కోసం విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు. దీంట్లో భాగంగానే స్వదేశీ, విదేశీ, కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను హరించివేసే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చాడని, ఇటువంటి విధానాలనే వ్యవసాయ రంగంలో చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా, భారతదేశ రైతన్నలు నరేంద్ర మోడీ లాంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పోరాడి మెడలువంచి ఏవిధంగా అయితే చిత్తు చేశారో అదేవిధంగా భారతదేశపు బొగ్గు గనికార్మికులు కూడా మన రైతన్నలను ఆదర్శంగా తీసుకొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. నవంబర్ 30 కలకత్తాలో జెబీసీసీఐ 7వ సమావేశం జరిగితే కార్మిక సంఘాలు కనీసం 50% పెరుగుదలను కోరినప్పటికీ యాజమాన్యాలు మాత్రం 10% శాతం కంటే పెంచలేమని మొండికేయడంతో కనీసం 28% పెరుగుదల ఉంటేనే మాట్లాడదామని కార్మిక సంఘాలు కోరినప్పటికీ కోల్ ఇండియా చైర్మన్ సమావేశం నుంచి వెళ్లిపోవడం చూస్తుంటే ప్రభుత్వం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం అయిపోతుందన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ విధానాల వలన జేబీసీసీఐలో బడా కార్పొరేట్ కంపెనీల ప్రమేయం పెరిగి పోయిందని, ఇన్నాళ్లు పెద్దన్న లుగా వ్యవహరించిన జాతీయ కార్మిక సంఘాల పాత్ర సన్నగిల్లిందని, అదే నేడు జేబీసీసీఐని శాసిస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులంతా ఈ నెల 9న నిరసన గళం వినిపించి కళ్ళు మూసుకుపోయిన మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కార్మిక సంఘాల జేఏసీ సింగరేణి గని కార్మికులకు పిలుపునిస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (జిఎల్బికేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, టీన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మని రామ్ సింగ్, ఎస్జికేఎస్ రాష్ట్ర కన్వీనర్ అంబాలా మహేందర్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాజన్న, తెలంగాణ ఉద్యమ నాయకుడు దుగుట శ్రీనివాస్, సింగరేణి పర్మినెంట్,కాంట్రాక్ట్ కార్మికులు పా
ల్గొన్నారు.