Sunday, 8 November 2026

బొగ్గు బ్లాకుల కోసం ఐక్యంగా పోరాడుతాం

బొగ్గు బ్లాకుల కోసం ఐక్యంగా పోరాడుతాం

అఖిల పక్ష రాజకీయ పార్టీల ప్రతిజ్ఞ

తెలంగాణ బొగ్గు సింగరేణికే

 

తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించడం కోసం ఐక్యంగా పోరాడుతామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రతినపునారు.
అక్షర ఫౌండేషన్ సౌజన్యంతో గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష రాజకీయ పార్టీల సదస్సులో నాయకులు మాట్లాడారు. తెలంగాణ బొగ్గు సింగరేణికే పేరుతో నాటి రాష్ట్ర సాధన ఉద్యమం తరహాలో పోరాటానికి, త్యాగాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో సింగరేణి సంస్థ గుర్తించిన బొగ్గు బ్లాకులను వేలం వేయడం వలన సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదకరమని వారు అన్నారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణి సంస్థ కూడా బ్లాకులను వేలంపాట ద్వారా దక్కించుకోవాలని కేంద్రం ఆదేశించడం తగదని అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో అనుభవం కలిగిన సింగరేణికి బొగ్గు బ్లాక్ లను ఇవ్వటం వలన తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతృత్వం అవసరమని బిజెపి మినహా ఇతర నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 1990 నుంచి ప్రారంభమైన ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ వలన దేశంలో సంఘటిత కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తపరిచారు.కాంట్రాక్టు కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి శ్రమిస్తున్నా చాలీచాలని జీతాలే కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. విమర్శలకు తావు లేకుండా ఏకతాటిపై పోరాడితేనే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణకు గుండెకాయగా నిలిచిన సింగరేణి కాపాడుకోవాలంటే బేధాభిప్రాయాలను పక్కనపెట్టి స్పష్టమైన కార్యాచరణతో పార్లమెంటును ముట్టడించాలని చెప్పారు. బొగ్గు బ్లాక్ ల సాధన కోసం కోల్ బెల్ట్ ఏరియాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు పోరాటానికి నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బ్లాక్ ల వేలం ప్రక్రియను బిజెపి ప్రారంభించలేదని, గతంలో వేలంపాటలో పాల్గొన్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఎందుకు పాల్గొనడం లేదని బిజెపి నాయకుడు ప్రశ్నించాడు. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏలాంటి పోరాటానికైనా బీజేపీ సిద్ధమేనని పేర్కొన్నారు. సింగరేణి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఎండి మునీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసు రామమూర్తి, బిజెపి పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ పి. మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్, బి ఆర్ ఎస్ రామగుండం నియోజకవర్గ అధికార ప్రతినిధి నారాయణదాసు మారుతి, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే విశ్వనాథ్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంది చంద్రయ్య, తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్, నిర్వాహకులు పర్లపెల్లి రవి, జేవి. రాజు, మంచిర్యాల కార్పొరేటర్ సుధాకర్, ఐఎఫ్ టియు నాయకుడు తోకల రమేష్, ఏ ఐ ఎఫ్ టి యు నాయకుడు రాములు,పలు రాజకీయ పార్టీల నాయకులు విజయ్, సునీల్, జాహిద్ పాషా,కె. కనకరాజు, బోడకుంట కనకయ్య,సీఎల్సీ రవి, రత్నకుమార్, కల్వల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు………..జనం సాక్షి