Wednesday, 4 November 2026

బొగ్గు సరఫరా ఒప్పందం. తెలంగాణ ఎన్టీపీసీ ప్లాంట్కు బొగ్గు సరఫరాకు సింగరేణితో ఒప్పందం

బొగ్గు సరఫరా ఒప్పందం.
తెలంగాణ ఎన్టీపీసీ ప్లాంట్కు బొగ్గు సరఫరాకు సింగరేణితో ఒప్పందం
ఈ ఏడాది ఏప్రిల్ వరకు 4 లక్షల టన్నులు
వచ్చే ఏడాది 80 లక్షల టన్నుల బొగ్గు సరఫరా
ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన ఇరు సంస్థల ఉన్నత అధికారుల మధ్యన
రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ (2 X 800) మెగావాట్ల ఫేజ్-1 ప్లాంట్లకు సింగరేణి సంస్థ నుంచి బొగ్గు సరఫరాకు మంగళవారం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. సింగరేణి సంస్థ ఈడీ(కోల్ మూమెంట్) జె.అల్విన్, ఎన్టీపీసీ తెలంగాణ ప్రాంత పర్యవేక్షక ఉన్నతాధికారి పాల్ సమక్షంలో జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, ఎన్టీపీసీ జీఎం(ఫ్యుయేల్) శ్రీ తపస్ సాహాలు సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం ఫేస్ -1 లోని 800 మెగావాట్ల ప్లాంట్కు సింగరేణి సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ వరకు 4 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయనున్నదని జీఎం(మార్కెటింగ్) కె.సూర్యనారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఫేస్ -1 లోని రెండు ప్లాంట్లకు (2 X 800) కలిపి 80 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడానికి ఈ సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించామని, త్వరలోనే ఈ మేరకు ఒప్పందం జరగనుందని వెల్లడించారు. సింగరేణి సంస్థ రామగుండంలో ఇప్పటికే గల ఎన్టీపీసీ వారి 2600 మెగావాట్ల ప్లాంట్కు ఏడాదికి 112 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తూ వస్తోందని, కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ ప్లాంట్ కు కూడా బొగ్గును అందించడం సంతోషకరంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ తో సహా దేశ వ్యాప్తంగా దాదాపు 8 రాష్ట్రాల్లో ఉన్న 13 ఎన్టీపీసీ ప్లాంట్లకు సింగరేణి సంస్థ ఏటా 139 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తోందని, తద్వారా దేశాభివృద్ధి లో సింగరేణి భాగస్వామి కావడం సంతోషకరమన్నారు.
సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ప్రత్యేక చొరవతో ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నామని, రానున్న ఎండా కాలంలో సింగరేణి తో ఒప్పందం ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా ఎప్పటి లాగానే ఈసారి కూడా నిరంతరాయ సరఫరాకు రైల్వే శాఖ సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో ఇంకా సింగరేణి సంస్థ నుంచి డీజీఎం (మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, ఎస్వోఎం సురేందర్ రాజు, అడిషనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి, ఎస్ఈ రవి శ్రీవాస్తవ, ఎన్టీపీసీ ఏజీఎం ఆవిష్కర్ మెష్రమ్ పాల్గొన్నారు.

-జనం సాక్షి – హైదరాబాద్