సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, గీత పనివారాల సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మగాని వెంకటయ్య మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని బొమ్మగాని వెంకటయ్య నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వెంకటయ్య పార్టీకి చేసినటువంటి సేవలు మరవలేనివని కొనియాడారు.పార్టీలో కీలక పాత్ర పోషించారని అన్నారు.అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు.నాటి నుండి నేటి వరకు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారని,ఆయన సోదరుడైన బొమ్మగాని ధర్మభిక్షం అడుగుజాడల్లో పయనించి ప్రజల గుండెల చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అనంతుల మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, శాంతి సంఘం జిల్లా అధ్యక్షులు తోగిటి మురళి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి తదితరులు పాల్గొన్నారు.




