Monday, 2 November 2026

బోరు బావిలో పడిన చిన్నారి మృతి

NLG-N-SAGAR-BORE-BAVI-PHOTO
పెద్దవాడ(నల్గొండ) ఆగస్టు 2 (జనంసాక్షి) :

మూడున్నరేళ్ల బాలుడు బోరు బావిలో పడి మృతి చెందిన సంఘనటన ఆదివారం నల్గొండ జిల్లా, పెద్దవూర మండలంలోని పులిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాలగోని నర్శింహ్ణొడ్‌, సరితలకు శివ, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తల్లిదండ్రులతో పాటు శివ వ్యవసాయ భూమికి వెళ్లాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవగా.. శివ తన అక్కలతో కలిసి పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం వేసిన బోరు బావిలో ఒక్కసారిగా జారి పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సమీపాన రైతులతో కలిసి తాడు సాయంతో శివను పైకి లాగడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోయేసరికి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ యంత్రాల సాయంతో బోరుబావి చుట్టూ గుంతను తవ్వి బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు. దేవరకొండ డీఎస్పీ ఎం.జి చంద్రమోహన్‌, ఆలియా సీఐ పార్థసారధి సంఘటనాస్థలానికి చేరుకొని మరికొన్ని యంత్రాల సాయంతో బాలుడిని తీయడానికి తీవ్రంగా శ్రమించారు. రెండున్నర గంటల అనంతరం బోరుబావి లోంచి బాలుడిని బయటకు తీసి నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. నల్గొండ జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు కర్నాటి లింగారెడ్డి, సాగర్‌ తెరాస ఇన్‌ఛార్జి నోముల నర్శింహయ్య, రైతు సంఘం నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డిలు సంఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *