బ్రిటన్ నుంచి వచ్చిన 925 మందిలో 16 మందికి కరోనా పాజిటివ్
– 76 మంది ప్రైమరీ కాంట్రాక్టు
– జల్లెడపడుతున్న తెలంగాణ సర్కారు
హైదరాబాద్,డిసెంబరు 25 (జనంసాక్షి):యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 16 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ 16 మంది బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించి 76 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినవారిలో నలుగురు హైదరాబాదీలు, నలుగురు మేడ్చల్ జిల్లాల వాసులు, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరు చొప్పున ఉన్నారు. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఒకరికి చొప్పున పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన 1,200 మందిలో 926 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని.. జీనోమ్ సీక్వెన్స్ కోసం నమూనాలను సీసీఎంబీకి పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు.