బ్రెయిలీ లిపిని విస్తృత పరచాలి.*
*ఘనంగా లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి.*
—————————–
(ఎన్‌పిఆర్‌డీ బచ్చన్నపేట మండల కార్యదర్శి కొత్తపల్లి రమేష్.)
బచ్చన్నపేట జనవరి 4 (జనం సాక్షి)
అందులు, పాక్షిక దృష్టి లోపం కలిగినవారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డీ) బచ్చన్నపేట మండల కార్యదర్శి కొత్తపల్లి రమేష్ హెచ్చరించారు.
బుధవారం రోజున బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎన్‌పిఆర్‌డీ మండల కార్యాలయంలో మండల కమిటీ సభ్యులు బైరగోని మహేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లూయిస్ బ్రెయిలీ 214వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం కొత్తపల్లి రమేష్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆరు చుక్కలను ఉపయోగించి అక్షరాలు మరియు అంకెలను స్పర్శ ద్వారా తెలుసుకోవడానికి దోహదం చేస్తుందన్నారు. బ్రెయిలీ లిపి అందుబాటులో ఉండడం ద్వారా అనేకమంది అంధులు ఉన్నత విద్యావంతులు అవుతున్నారని తెలిపారు. లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4న పారిస్ దగ్గరలోని కృవే అనే గ్రామంలో జన్మించినారని అన్నారు. బ్రెయిలీ తల్లిదండ్రులు గుఱ్ఱపు జీనుల తయారు పరిశ్రమలో పనిచేసేవారని, బ్రెయిలీ తన తండ్రి తోలుతో పని చేయడాన్ని చూసి అతన్ని అనుసరిస్తూ ఒకరోజు తన తండ్రి మాదిరిగా తోలుకు రంధ్రాలు చేయడానికి ప్రయత్నిస్తే ప్రమాదవశాత్తు అతని కంటికి ఇనుప ముక్క తగిలి గాయమైందన్నారు. కంటికి తగిలిన గాయం నుండి బయటపడేందుకు బ్రెయిలీ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ సఫలం కాలేదన్నారు. చివరకు రెండో కంటి చూపు కూడా కోల్పోయాడని అన్నారు. పారిస్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ లో చేరి విప్లవాత్మకమైన బ్రెయిలీ లిపిని కనిపెట్టినాడని తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2018 సంవత్సరంలో జనవరి 4ను అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవంగా జరపాలని నిర్ణయించిందని, 2019 నుండి ప్రపంచవ్యాప్తంగా లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. అందులు వినియోగించుకునే విధంగా సామూహిక ప్రాంతాలన్నీ అవరోధ రహితంగా మార్చడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరడంలో ప్రభుత్వాలు విఫలం చెందినాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం వైద్యుల ద్రువీకరణ పత్రం ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించి, అంధులకు అన్యాయం చేస్తుందని విమర్చించారు. అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం స్ఫూర్తితో అందులు మరియు దృష్టి లోపం కలిగినవారి హక్కులకోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కామిడి సిద్దారెడ్డి, గోదల ఐలయ్య, జీ. సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




