భవిష్యత్ బిజెపిదే
నల్లొండ,అక్టోబర్19(జనంసాక్షి): ఎంతసేపూ మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్ఎస్ నేతలు ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారో చూపాలని బిజెపి అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. మాటలు తప్ప చేతలు మాత్రం అడుగు దాటడం లేదని తెరాస ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నేతల పార్టీ ఫిరాయింపులపై తప్పితే రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడంపై సీఎం దృష్టి సారించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు భాజపాదేనని అన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశపడితే తెరాస ప్రభుత్వం అన్ని వర్గాలను వంచించిందన్నారు. అనుభవం, పాలనా దక్షత, క్రమశిక్షణ కలిగిన పార్టీ భాజపావైపే తెలంగాణ ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రచారానికే పరిమితమై అన్ని రంగాలలో విఫలమవుతున్న తెరాస తీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తెరాస వైఫల్యాలతో పాటు కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భాజపా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాదే అధికారమన్నారు. ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. తెరాసది అంతా మాటల ప్రభుత్వమని అన్నారు.