Monday, 2 November 2026

భాగ్యనగరంలో ఉగ్రకదలికలు

– భారీ విధ్వంసానికి ఐసీస్‌ కుట్ర
– నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఎన్‌ఐఏ సోదాలు
– ఐసీస్‌ సానుభూతి పరుడు తహాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– మూడుగంటల పాటు విచారించిన అధికారులు
హైదరాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో మరోసారి ఉగ్రకలకలం రేగింది. నగరంలో శనివారం ఎన్‌ఐఏ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలో ఐసిస్‌ సానుభూతిపరులు ఉన్నారన్న సమాచారంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శనివారం ఉదయం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. అబుదాబీ ఐసిస్‌ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు నగరంలో ఉన్నారన్న సమాచారంతో ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. శనివారం ఉదయం 8 గంటలకు శాస్త్రిపురంలోని 8 మంది ఐసిస్‌ సానుభూతిపరులకు సంబంధించిన ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. గతేడాది అరెస్ట్‌ అయిన అబ్దుల్‌ బాసిత్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తుంది. కాగా సోదాల అనంతరం తహన్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహన్‌ను గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది.
కాగా, ఎన్‌ఐఏ సోదాల్లో బయటపడిన విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. ఢిల్లీలో ఓ వీహెచ్‌పీ నేత హత్యకు అబ్దుల్‌ బాసిత్‌ వేసిన పథకాన్ని భగ్నం చేసిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు హైదరాబాద్‌కు పారిపోయివచ్చాడు. అనంతరం ఇక్కడ కొంత మంది యువకులతో కలిసి ఉగ్రదాడులకు వ్యూహరచన చేయడంతో బాసిత్‌ను పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, మరోసారి అంతర్జాలం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించినట్టు గుర్తించడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. కింగ్స్‌ కాలనీలోని ఎనిమిది ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు, బాసిత్‌, అతడితోపాటు అదుపులోకి తీసుకున్న ఇద్దరి సహచరుల కుటుంబసభ్యులను ప్రశ్నించారు. అలాగే తరహా అనే అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రహమాన్‌ అనే తీవ్రవాది ఇచ్చిన సమాచారంతో పాతబస్తీలోని షాహిన్‌నగర్‌, పహాడీషరీఫ్‌లో ఎన్‌ఐఏ తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. ఐసిస్‌తో సంబంధాలున్న కొందరు వ్యక్తులు ఇక్కడ తలదాచుకున్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు. ఈ సోదాల్లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అలాగే ఓ ఇంట్లో కీలకమైన ల్యాప్‌టాప్‌తో పాటూ మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని కింగ్స్‌ ప్యాలెస్‌ నగర్‌లో ఉన్న తాహా అనే యువకుడిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా ఇతడిని మడు గంటల పాటు విచారించారు. ఆ తర్వాత తాహాను మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. మహారాష్ట్రలో ఐసిస్‌ సానుభూతిపరుడు అబ్దుల్‌ బాసిత్‌తోపాటు మరో ఇద్దరికి తాహా ఆశ్రయం కల్పించాడని అధికారులు చెబుతున్నారు. బాసిత్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశాక మహారాష్ట్ర నుంచి తాహా మకాం మార్చినట్టు చెప్పారు. 6 నెలల నుంచి హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌ పరిధిలోని శాస్త్రిపురంలో నివాసం ఉంటున్నాడన్న పక్కా సమాచారంతో శనివారం ఉదయం అధికారులు సోదాలు చేసి తాహాను అదుపులోకి
తీసుకున్నారు