
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ. శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యం, మైనార్టీ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ ఈ సమయంలో చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా యూఎస్ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కి మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘మైనార్టీల హక్కులను మెరుగుపరచడానికి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది..?’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించారు. దానికి ప్రధాని బదులిస్తూ.. ‘మీరు అడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నే ఉండదు’ అని ప్రధాని స్పష్టం చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదం మీదే తమ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.




