భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం
భారత హాకీ జట్టు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ తాజాగా ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషుల సీనియర్ టీమ్‌లో ఈ నెంబర్ జెర్సీని మరొకరికి కేటాయించరు. కానీ, జూనియర్ హాకీ జట్టులో మాత్రం యాథావిధిగా నెం. 16 జెర్సీ ఉండనుంది. ఈ మేరకు హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోళా నాథ్ సింగ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘పురుషుల సీనియర్ హాకీ టీమ్ నుంచి శ్రీజేశ్ జెర్సీ నెం.16ను రిటైర్ చేస్తున్నాం. ఇకపై ఈ నెంబర్ జెర్సీ ఇంకెవరికీ ఉండదు. అయితే జూనియర్ హాకీ జట్టులో మాత్రం నెం.16 జెర్సీ కనిపిస్తుంది. ఇక శ్రీజేశ్ ఇప్పుడు జూనియర్ హాకీ టీమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అతడు మరికొంత మందిని శ్రీజేశ్గా తీర్చిదిద్దాల్సి ఉంది’ అని నాథ్ సింగ్ అన్నారు.
కాగా, గత రెండు ఒలింపిక్స్ (టోక్యో, పారిస్)లో టీమ్ఇండియా కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీజేశ్ పారిస్ విశ్వ క్రీడలతోనే తన సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.