Friday, 6 November 2026

భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి

భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు
హుజూర్ నగర్ డిసెంబర్ 16 (జనం సాక్షి): ఈనెల 29న ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లి సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఏటేటా నిధులు తగ్గిస్తూ కఠినమైన నిబంధనలు పెట్టి ఉపాధి కూలీలకు ఉపాధి లేకుండా చేస్తుందని అన్నారు. ఉపాధి కూలీలందరూ కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ సభకు హాజరు కావాలని వారి విజ్ఞప్తి చేశారు. సమగ్ర వేతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే చేయాలని కోరారు. ఆహార భద్రత చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రేషన్ దుకాణాలను కేరళ తరహాలో నిర్వహించి 16 రకాల నిత్యవరు వస్తువులను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ,డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగడం మూలంగా పేద , మధ్యతరగతి ప్రజలపై అనేక భారాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య , వైద్యం , ఉపాధి ,కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 40% నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీల కోసం కూలి బందు ,కూలి బీమా , వంటి చట్టాలు తేవాలని వారన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు. పేదవారందరికీ ఇల్లు కట్టించాలని ,భూమిలేని దళిత ,గిరిజన ,పేదలందరికీ ,ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 29న ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజన్ , అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కార్యదర్శి బి వెంకట్ , ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నగారపు పాండు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వెంకట్ రెడ్డి ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్ ,డివైఎఫ్ఐ మండల నాయకులు జిట్ట బోయిన అరవింద్, రాము తదితరులు పాల్గొన్నారు.