భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద

సామర్థ్యానికి మించి వచ్చి చేరుతున్న నీరు
17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
కడెం వద్దే మకాం వేసిన మంత్రి ఇంద్రకరణ్‌
కడెం ప్రాజెక్టు పరిస్థితిపై మంత్రికి సిఎం కెసిఆర్‌ ఫోన్‌

నిర్మల్‌,జూలై13(జనంసాక్షి ): భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. వరద ఉగ్రరూపం దాల్చడంతో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తున్నది. దీంతో 1995 తర్వాత ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటి సారని అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి 2 లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు నిర్వహించే గేజింగ్‌ రూమ్‌లోకి వరద నీరు చేరింది. భారీగా వరద వస్తుండటం తో అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొత్తం 18 గేట్లలో ఒకటి మొరాయించింది. దీంతో 17 గేట్ల ద్వారా వరదను కిందికి విడుదల చేస్తున్నారు. పెద్దఎత్తున నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. వరద ఉధృతిపై మంత్రికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఆరా తీశారు.
కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో వరద ఉధృతిపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి ఫోన్‌చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. వరద కొంత తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కడెం ప్రాజెక్టుకు 4.97 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులోకి భారీగా వస్తుండగా, ఔట్‌ ఎª`లో అదేస్థాయిలో లేకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం, దస్తురాబాద్‌ మండలాలకు చెందిన 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే కడెం ఉధృతిపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ ఏజెన్సీలో వరద బీభత్సం సృష్టిస్తున్నది. వరద ఉధృతికి శంభు మత్తడి గూడ ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దీంతో వరద దిగువ ప్రాంతాల్లోకి చేరుతోంది. ఈ క్రమంలో దిగువన ఉన్న లక్కారం, గంగన్నపేటలకు వరద ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జిల్లాలోని ఇచ్చోడలో 32.90 సెంటీవిూటర్లు, నేరడిగొండలో 29.1 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది.