– అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
బెల్లంపల్లి, మార్చ్ 16, (జనంసాక్షి )
భావితరాలకు అడవులే ఆధారం అని, అడవులతోనే ఆరోగ్యం అని అటవీ శాఖ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో లబ్ధిదారులకు తునికాకు బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి జీవనదారం అయిన అడవిని సంరక్షించుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలం అని అన్నారు. కరోనా సమయంలో ఆక్సీజన్ కొరతతో అమూల్యమైన ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికి తెలిసిందే అని, స్వచ్ఛమైన ఆక్సీజన్ ఇచ్చే అడవులను అంతరింప జేయడం వల్ల భావితరాలకు అడవులను చూసే అవకాశం లేకుండా పోతుందన్నారు. అడవులు ఉండటం వల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. హరితహారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అడవుల పెంపకానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. దీనికి నిదర్శనం ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలే అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల మనిషి అని పేదల అవసరాలను ముందే గుర్తించి తీర్చే గొప్ప వ్యక్తి కెసిఆర్ అన్నారు. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తున్నాయని, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రమే టాప్ లో ఉందన్నారు. మన సంక్షేమ పథకాలను చుసి అక్కడి ప్రజలు రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయని వివరించారు. ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తాం అని చెప్పగానే అక్కడి ప్రభుత్వం ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని అన్నారు. ఆసరా పింఛన్లు అయితే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇస్తుందన్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం అయిన గుజరాత్ లో కేవలం 650 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. అంతే కాకుండా అన్ని సంక్షేమ పథకాల్లోను తెలంగాణ దూసుకెళతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే కొందరు నాయకులు జెండాలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 20 దేవాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయని వాటికి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించాలని, అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని, రోడ్ల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న అటవీ అనుమతులు ఇప్పించాలని, అటవీ, రెవెన్యూ శాఖల మద్య వివాదం నెలకొన్న భూములకు జాయింట్ సర్వే చేపట్టి సాగులో ఉన్న రైతులకు న్యాయం చేయాలని మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం తునికాకు లబ్ధిదారులకు 10,87,49,288 రూపాయల తునికి ఆకు సేకరణ బోనస్ చెక్కల పంపిణీ, మండలం లోని 29 మంది లబ్ధిదారులకు 29,03,364 రూపాయల విలువగల కల్యాణలక్ష్మి చెక్కులను, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణమాఫీ 2,63,27,000 రూపాయల విలువగల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు వంద శాతం రుణాలు ఇప్పించడంలో కృషి చేసిన ఐకేపీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్ ఎం డోబ్రియల్, మంచిర్యాల డిఎఫ్ఓ ఆశీష్ సింగ్, కొమురం భీం ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్, బెల్లంపల్లి ఎఫ్డిఓ వినయ్ కుమార్, మంచిర్యాల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్డిఓ వేణుబాబు, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు, గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఆర్డివో శ్యామల దేవి, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ వరలక్ష్మి, ఏపీఎం విజయలక్ష్మి, రేంజర్ గోవింద్ చంద్ సర్దార్, ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, స్థానిక సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్, నాయకులు గడ్డం భీమా గౌడ్, సంతోషం ప్రతాప్ రెడ్డి, సింగతి రాంచందర్, పంజాల విద్యా సాగర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భావితరాలకు అడవులే ఆధారం.




