వీర్నపల్లి, జూన్ 04 (జనంసాక్షి): బానుడి భగ భగతో ఇంట్లో నుంచి భయట అడుగు పెట్టాలంటే అగ్గిని ముట్టినంత భావన కలుగుతుంది. అలాంటి ఎండలో కొంచెం దూరం వెళ్తే నీటి కోసం కళ్ళు వేతుకుతాయి. ఇలాంటి పరిస్థితే జంతువులకు ఎదురైతే ఎలా…వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని ఓ విద్యాలయంలో చెట్ల నీడకు సేద తీరుతున్న కోతులు దాహం తీర్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాయి. తన బిడ్డతో దాహం తీర్చుకోవడానికి అక్కడే ఉన్న బోర్ పైపులో నుంచి వచ్చే ఒక్కో నీటి చుక్కను నోటితో పట్టుకొని దాహం తీర్చుకోవడానికి తల్లి, బిడ్డ ప్రయత్నం చేశాయి. వాటిని గమనించిన విజయ్ అనే యువకుడు వాటిని చూసి చలించి వాటికి నీటిని ఏర్పాటు చేశాడు. వెంటనే వానరాలు దాహార్తిని తీర్చుకొని అక్కడి నుంచి విజయ్ ను కృతఙ్ఞతతో చూస్తూ వెళ్లిపోయాయి. దీనిని చూసిన పలువురు విజయ్ ను అభినందించారు. వేసవి కాలం అయ్యే వరకు కోతుల దాహం తీర్చడానికి నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
మండుటెండలో దప్పిక తీర్చుకోవడానికి వానరం తిప్పలు




