జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ వైద్యశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం సందర్శించారు. టిఆర్ఎస్ నాయకులు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు మంథని మున్సిపల్ కౌన్సిలర్ పెండ్రు రమాదేవి, మంథని మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వం నుండి గత రెండు సంవత్సరాల కాలంలో ఆస్పత్రికి ఎలాంటి నిధులు రాలేదని ఆస్పత్రి సూపర్డెంట్ కి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.
2009 నుండి 50 పడకల ఆస్పత్రి ఉండే మరి ఇప్పుడు 25 పడకలకు ఎందుకు అయిందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శానిటేషన్ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవు అని , పెద్దపెల్లి, గోదావరిఖని ఆసుపత్రులలో 11,500 రూపాయలు చెల్లిస్తే మంథనిలో 5000 రూపాయలు చెల్లిస్తున్నారని, 7000 రూపాయలు రెండు నెలల జీతం ఇచ్చి మీకు దిక్కుంటే చేయండి లేకుంటే తీసేస్తాం అని సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.




