… నేడు జిల్లా అధికారి ఆకస్మిక తనిఖీ…! జనంసాక్షి, మంథని : ఓవైపు పదో తరగతి పరీక్షలు… మరోవైపు రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్ పల్లి వద్ద ఉన్న “తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ” ఆధ్వర్యంలో నడుస్తున్న మంథని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఉదయమే పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీ మేరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాగా జిల్లా అధికారి తనిఖీ చేసే సమయానికి పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్ ఇతర సిబ్బంది పాఠశాల సమయానికి కానీ ప్రార్థన కు కూడా సకాలంలో హాజరు కానట్టు సమాచారం…!. ప్రతిరోజూ కూడా పాఠశాల సమయానికి హాజరు కాకుండా ఇతర ప్రాంతాల నుండి రోజు వచ్చి పోతున్న విషయాన్ని కూడా సి.సి. కెమెరాల ద్వారా తెలుసుకొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రంజాన్ మాస ఉపవాస దీక్షల నేపథ్యంలో హాస్టల్లో అమలు చేస్తున్న మెనూ, ఇతర అసౌకర్యాల గురించి ఆరా తీసినట్టు తెలిసింది.!. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం పాఠశాలలోని అడ్మిషన్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ మైనారిటీ లకు సీట్లను కేటాయించినట్టు,కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో కూడా అర్హత లేని వారిని నియమించినట్టు ఇటీవల కొందరు హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంథని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను నిన్న మైనారిటీ విజిలెన్స్ విభాగం.. నేడు జిల్లా మైనారిటీ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..! ఏది ఏమైనా మారుమూల ప్రాంతంలో ఉన్న మంథని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, సక్రమంగా మెనూ ను అమలు చేయాలని, పాఠశాల సిబ్బంది సరియైన సమయపాలన పాటించాలని, పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పైరవీల పేరిట జరుగుతున్న నాన్ మైనార్టీ విద్యార్థుల అడ్మిషన్ల విషయం లో, జరుగుతున్న ఖర్చుల అధిక బిల్లుల విషయంలో విచారణ జరిపించాలని, అర్హతల మేరకే మాత్రమే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలు చేయాలని పలువురు కోరుతున్నారు.
మంథని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి – నిన్న విజిలెన్స్ విభాగం




