
జనం సాక్షి/ కొల్చారం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. దాంతో పల్లె ప్రకృతి వనంలో సేద తీరేందుకు వస్తున్న సీనియర్ సిటిజన్స్, ఆటలు ఆడుకునేందుకు వస్తున్న చిన్నారులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పల్లె సీమల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మూడు సంవత్సరాల క్రితం ఒక్కో గ్రామానికి 20 గుంటల విస్తీర్ణంలో ఒక్కో పల్లె ప్రకృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యలో రోడ్లు వదిలి… రోడ్ల పక్కన పూల మొక్కలు… ఔషధ మొక్కలు… చుట్టూరా పెద్ద చెట్లు నాటారు. అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. అందమైన పూలు పూయడంతో చూపరులను ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటున్నాయి. మందుబాబులు పల్లె ప్రకృతి వనాలను అడ్డా చేసుకొని మద్యం సేవించడం, ఖాళీ సీసాలు పగలగొట్టి పడవేయడంతో పల్లె ప్రకృతి వనాల్లోకి వచ్చే సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలకు ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా మందుబాబులు గొడవలు చేస్తుండడంతో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మండల పరిధిలోని కొంగోడు, చిన్నగన్పూర్ పల్లె ప్రకృతి వనాల్లో మందుబాబులు అడ్డా వేసి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పల్లె ప్రకృతి వనాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ పాలకవర్గాలు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై మండల పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా సమాధానం దాటవేస్తూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు.




