Wednesday, 4 November 2026

మణిపూర్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ విద్యార్థులు

 హైదరాబాద్‌ : మణిపూర్‌లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మణిపూర్‌లో అల్లర్ల నేపధ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది.
సోమవారం ఉదయం మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ మీదుగా బయలు దేరిన విమానం మధ్యాహం రెండు గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తెలంగాణ భవన్‌ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు స్వాగతం పలికారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన స్పందించి పలు ఏర్పాట్లు చేసిందన్నారు. తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక అధికారులను నియమించిదని, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.