మత విశ్వాసాల పై రాజ్యాంగ ఉల్లంఘన?
కొండమల్లేపల్లి జనవరి 4 జనంసాక్షి ఆర్టికల్ :
మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వలేమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ దళితుల హక్కులను హరించేదిగా ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు విఘాతం కలిగించేదిగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ మత స్వాతంత్రపు హక్కు కల్పించబడినది. అనగా పౌరులందరూ ఎవరికి నచ్చిన మతం వారు స్వీకరించుటకు స్వేచ్ఛ కల్పించబడినది. దీని ప్రకారం మత స్వేచ్ఛ అనేది పౌరులందరికీ ప్రాథమిక హక్కు.
మతం అంటే వ్యక్తుల లేదా సమాజాల విశ్వాసానికి సంబంధించిన విషయం. దానిని కులంతో ముడి పెట్టడం సరికాదు. మతం అంటే ఆత్మ , అంతరాత్మకు సంబంధించిన విషయం అని అన్ని మతాలు తమ అభిప్రాయాలను వెల్లడిబుచ్చాయి. దేశంలో పూర్వం కులం వృత్తులపరంగా శరీరానికి ఆపాదించబడింది. కావున పూర్వం నుండి వారి వారి పూర్వీకుల నుండి కులం నేటి వరకు మరియు ముందు తరాల వారికి ఆపాదించబడుతుంది. కావున మతం మారిన వారికి కులం ( రిజర్వేషన్ ) ఎలా పోతుంది? వెనుకబడిన కులాల ప్రజలపై వివక్ష ఉండకూడదని రాజ్యాంగo లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు, 341 ప్రకారం ఎస్సీలకు, 342 ప్రకారం ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.
నేడు దేశంలో మతం మారిన అన్ని వర్గాలకు అనగా ఓసి, బీసీ, ఎస్టీ, ప్రజలకు రిజర్వేషన్ మారకుండా అదే కొనసాగుతుంది . అలాంటిది మతం మారిన దళితులకే ఎందుకు ఎస్సీ హోదా ఇవ్వలేనటుoది కేంద్ర ప్రభుత్వం. ఇది కాదా దళితులపై మత స్వేచ్ఛలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష. మతం మారిన దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ హోదా తొలగించడం ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంగనే అవుతుంది. మరియు దళితులు సిక్కులుగా, బౌద్ధులుగా, హిందువులుగా మతం మారిన వారికి ఎస్సీ హోదా కల్పిస్తూనే క్రైస్తవులుగా ముస్లింలుగా మారిన దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఇవ్వలేం అనడం ఈ మతాలపై, ఈ దళితులపై మాత్రమే వివక్ష చూపుతున్నట్టు కనిపిస్తుంది.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంగనాథ మిశ్రా కమిషన్ క్రైస్తవ, ముస్లిం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. దీనిని అప్పటి బిజెపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో 1997- 98లో పున్నయ్య కమిషన్ చేసిన అధ్యయనంలో దళితులు క్రైస్తవులుగా మారినా కూడా వారికి ఎస్సి హోదా కల్పించాలని రికమండ్ చేసినారు. అయినను అవేవీ సరిగా లేవని ఇటీవల బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే.జీ బాలకృష్ణన్ నేతృత్వంలో మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలా అనే విషయాన్ని పరిశీలించేందుకు రెండు సంవత్సరాల సమయం పెడుతూ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రిపోర్టు ఇవ్వకముందే కేంద్ర ప్రభుత్వం మతం మారిన దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వలేమని అఫిడవిట్ తయారుచేసి సుప్రీంకోర్టులో సమర్పించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం వాదనని కే.జీ బాలకృష్ణన్ కమీషన్ కూడా వినిపించాలని ఒత్తిడి తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ధోరణి కనబడుతుంది.
మతం మారిన ఎస్సీలను అన్ని రంగాలలో అనగా ఆర్థిక సామాజిక వివక్ష లేదు అని కేంద్ర ప్రభుత్వం చెబుతూ దళిత క్రైస్తవులను దళిత ముస్లింలను ఎస్సీ హోదా నుంచి తప్పించాలని చూస్తున్నట్లుగా ఉంది. కానీ మతం మారిన దళితులు నేటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని గుర్తుతెరగాలి. నేటికీ గ్రామాలలో, దళిత వాడలలో క్రైస్తవ ప్రార్ధన మందిరాలకు ఒక దళితులు మాత్రమే వెళుతున్నారు అంటే ఇంకా దళితులపై వివక్షత ఏ విధంగా ఉందో అద్దo పడుతుంది. కావున మతం మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ తీసివేస్తే వారు అన్ని రంగాల్లో వెనుకకు నెట్టబడి ఎంతో పేదరికంతో కొట్టుమిట్టాడి వారి జీవితాలు అంధకారం చేసే అవకాశం మెండుగా ఉంది.
భారతదేశం మతప్రమేయం లేని లౌకిక రాజ్యము. లౌకిక రాజ్యము అనగా అన్ని మతాల పట్ల తటస్థ స్వభావం, నిస్పాక్షికతను కలిగి ఉండుట. లౌకిక రాజ్యము ( ప్రభుత్వము ) మనిషికి మనిషికి మధ్య గల సంబంధాలను సూచిస్తుందే కానీ మనిషికి భగవంతునికి మధ్య గల సంబంధాన్ని పట్టించుకోకూడదని రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు గల పౌరుల మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తుంది. కావున రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా మతం మారిన దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ ప్రకారం అన్ని మతాల దళితులకు అభ్యున్నతి కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.
రచయిత :
యేకుల సురేష్. M.A., B.Ed.,( L.L.B)
రాజ్యాంగ పరిరక్షణ కార్యకర్త.




