Thursday, 5 November 2026

మన ఊరు మన బడి పనులు వేగవంతం చేయాలి

మన ఊరు మన బడి పనులు వేగవంతం చేయాలి
…జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
..మండలంలోని ఆయా గ్రామాల్లో పనుల పరిశీలన
రాజోలి 12 జనవరి (జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో పాఠశాల భవనాల మరమ్మతుల పనులను గురువారం పరిశీలించారు. మండలంలోని పెద్ద తాండ్ర పాడు, తుమ్మిళ్ల, రాజోలి,తూర్పు గార్లపాడు గ్రామాల్లో మన ఊరు మన బడి పనులను ఆమె పరిశీలించారు. అందులో భాగంగా పెద్ద తాండ్ర పాడు లోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 28 లక్షల తో, యమ్ పి పి యస్ పాటశాల లో 13 లక్షల రూపాయలతో నిర్మించిన మరుగుదొడ్లు, పాఠశాల భవనాల పై కప్పులు, ఇతర పనులను ఆమె పరిశీలించారు. పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో చర్చించినారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు అనుగుణంగా గ్రామ పంచాయితీ, అధికారులు పని చేసుకోవాలని సూచించారు. తుమ్మిళ్ల గ్రామంలో పాఠశాల భవనాన్ని వేరే చోటు లో నూతనంగా నిర్మించాలని, గ్రామస్థులు కోరగా..నూతన భవనానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతామని, అప్పటి వరకు విద్యార్థుల కు ఇబ్బందులు రాకుండా పాత భవనానికి మరమ్మతులు చేసి, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అనంతరం రాజోలి లోని తుమ్మల పల్లె పాఠశాల లో జరుగుతున్న పనులు పరిశీలించారు. చేనేత కార్మికుల సమస్యలపై వారితో మాట్లాదారు. మగ్గాలను పరిశీలించి, చీరలు నేసే విధానాలను పరిశీలించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలపై చర్చించారు. కాగా కొందరు చేనేత కార్మికుల కు చేనేత మిత్ర, ముద్ర రుణాలు అందటం లేదని ,ఆమె దృష్టి కి తీసుకురావడంతో అక్కడే ఉన్న చేనేత జౌళి శాఖ ఏ డి గోవిందయ్య తో బ్యాంక్ అధికారులతో మాట్లాడి వారికి ఇబ్బందులు పడకుండా అర్హులైన కార్మికుల కు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. కొత్త రాజోలి లో వర్షాకాలంలో చేనేత కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదని, వర్షం వస్తే నీరు మగ్గం గుంతలో చేరుతుందని, సీసీ రోడ్లు ఇంకా వేయాల్సి ఉందని సర్పంచ్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. వర్క్ షెడ్లు కూడా ఏర్పాటు చేయాలని, అప్పుడే కార్మికులకు ఊరట లభిస్తుంది అని ఆమె దృష్టి కి తీసుకువచ్చారు. అనంతరం ఆమె రాజోలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై,గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆయా అధికారులతో చర్చించారు. అనంతరం తూర్పు గార్లపాడు లో పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుగుణమ్మ, పి ఆర్ డి ఆంజనేయులు, తుమ్మిళ సర్పంచ్ రేణుక, పెద్ద తాండ్ర పాడు సర్పంచ్ శంకరమ్మ, రాజోలి ఉప సర్పంచ్ గోపాల్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు నిషాక్, తదితరులు పాల్గొన్నారు.