హైదరాబాద్, నమస్తే తెలంగాణ:పెద్ద నోట్ల రద్దు విషయంలో తాము దేశ అభివృద్ధి కోణంలోనే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని, వ్యక్తిగత ఆలోచనలకు అనుగుణంగా కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. దేశం రూపును మార్చే నిర్ణయానికి మద్దతిస్తున్నట్లే.. ప్రజావ్యతిరేక నిర్ణయం వెలువడితే నిరసన తెలుపడంలో తమదే మొద టిగళం అవుతుందని ఆయన తేల్చిచెప్పారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన శుక్రవారం పెద్ద నోట్ల రద్దుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. సభ్యులు చర్చలో పాల్గొన్న తర్వాత ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. నోట్ల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం తీరు కొందరికి మద్దతిస్తున్నట్లుగా ఉన్నదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పష్టతనిస్తూ.. మంచి పనులకు మద్దతిస్తాం. చెడ్డ పనులను వ్యతిరేకిస్తాం.
మా సలహాలు కూడా ఇస్తాం అని చెప్పారు. అసెంబ్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీకి ఒక విజ్ఞప్తి చేస్తూ.. ప్రధానమంత్రి గారూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తీసుకున్న పెద్ద నోట్ల రద్దును ఇక్కడితో ఆపవద్దు. సంపూర్ణ ప్రక్షాళన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఈ క్రమంలో మీకు పూర్తి మద్దతుగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడితో నిలిపివేసినా, పూర్తి ప్రక్షాళన చేయలేకపోయినా.. అది వినాశనానికి దారితీస్తుంది. అందుకే వందశాతం ప్రక్షాళన చేయండి. దానితో దేశంలో పేదరికం తగ్గుతుంది. ప్రజలు గౌరవప్రదమైన జీవితం పొందుతారు అని సీఎం కేసీఆర్ చెప్పారు
ప్రధాని ఆ మాట ముందే చెప్పారు
స్వైప్ మిషన్ల కొరతపై ఒవైసీతోపాటు టీడీపీ పక్షనేత రేవంత్‌రెడ్డి ప్రస్తావించడంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా స్వైప్ మిషన్ల కొరత ఉందనే విషయం ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలుసు. డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అయిన నేపథ్యంలో ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే ఈ లావాదేవీలు సురక్షితమా? కా దా? అని. ప్రతి సందర్భంలోనూ ఇది ఉంటది. పటిష్టమైన చట్టాలున్నప్పటికీ దొంగతనాలు జరుగుతున్నయి. డిజిటల్ చెల్లింపులతో సైబర్ ఆర్థిక నేరాలు పెరుగుతాయనడం సబబు కాదు. డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ప్రధానికి తెలుసు. గొప్ప పని ఏది మొదలుపెట్టినా మనం మద్దతివ్వాలి. పథకం పెడితే పైరవీకారులు, ఇండ్లు కట్టిద్దామని నిర్ణయం తీసుకుంటే దళారులు.. ఉన్నవాడు, లేనివాడు ఒకటే పోటీ పడటంతో ప్రజల్లో అసహనం వస్తున్నది. అటువంటివి జరుగవద్దనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు జానారెడ్డి తెలిపారు.అప్పటి ప్రధాని మన్మోహన్ మంచి ఆర్థికవేత్త. కానీ.. ఆయన ఆ పని చేయలేకపోయారు. అసాధారణమైన నిర్ణయమని పేర్కొంటూనే మోదీ ఈ చర్య తీసుకున్నారు. 50 రోజుల సమయం కోరారు అని అన్నారు.
ప్రజలంతా బాగుండాలన్నదే మా తపన
నోట్ల రద్దుతో రాష్ర్టానికి ఆదాయం పడిపోయిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్లలో రూ.15 కోట్ల నుంచి రూ.11కోట్లకు తగ్గింది. అందుకే రూ.500-600 కోట్లను సహాయంగా అందించాలని కోరాం. రాష్ట్ర ప్రజల కోసం చిన్న నోట్లను సరిపడా పంపాలని ప్రధానిని కోరిన. ఇపుడు అసెంబ్లీలో జరిగిన చర్చ వివరాలను సైతం మోదీకి, జైట్లీకి పంపిస్తాను. మా తపనంతా ఒకటే! రాష్ట్రంలో అందరూ బాగుండాలి. ప్రజలు కష్టాలపాలు కావద్దు. పెద్దాచిన్నా తేడాలేకుండా అందరి వ్యాపారాలు సాఫీగా సాగాలి. రాష్ట్రం బాగుండాలి అన్నారు.




