మరికాసేపట్లో పెళ్లి..అంతలోనే పెను విషాదం
పెళ్లికూతురును తీసుకుని వెళుతుండా ఘోరం
బొలెరో వాహనం నుంచి జారిపడి నలుగురు దుర్మరణం
ఒంగోలు,ఆగస్ట్25(జనంసాక్షి): ఆ ఇంట్లో కాసేపట్లో పెళ్లిభాజాలు మోగబోతున్నాయి. అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసి వరుడు ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపట్లో కల్యాణవేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది. పెళ్లిసందడిని చూసి మృత్యువుకు కన్నుకుట్టిందో ఏమో నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. పెళ్లి వారితో వెళ్తున్న వాహనం నుంచి జారిపడి నలురుగు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ జిల్లా తుర్లపాడు`కొనకమిట్ల మండలాల సరిహద్దు గ్రామమైన కలుజువ్వలపాడు వద్ద హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి వధువును తీసుకొని పొదిలిలోని అక్కచెరువుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాహనం వెనుకున్న డోర్ తెరుచుకోవడంతో వెనుక కూర్చున్నవారు రోడ్డుపై పడిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు శ్రీను, అనిల్, సుబ్బారావు, కార్తీక్‌గా గుర్తించారు. ఈ ప్రమాదం పెళ్లింటితో పాటు మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వధువు వాహనం ముందుభాగంలో కూర్చోవడం ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. బుధవారం ఉదయం 11గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహం జరగాల్సి ఉంది. ఉదయం వధువు ఇంటి నుంచి బయలుదేరగా… ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. ఘటనాస్థలిలో వధువు విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది. ప్రమాదం జరగడంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం శ్రీకాకుళం ఇలాంటి ప్రమాదమే జరిగింది. పలాస మండలం సమ్మాదేవి వద్ద జాతీయ రహదారిపై ఏఆర్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం ప్రమాదానికి గురైంది. ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మందస వద్ద ఓ ఆర్మీ జవాన్ మృతదేహానికి ఎస్కార్ట్ గా వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొని.. తిరిగి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.