హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): ఉల్లి ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కిలో 12 వరకు పలికిన ధరలు మళ్లీ ఏకంగా ప్రస్తుతం కిలో రూ.20కి చేరుకుంది. ఉల్లి సాగు తగ్గడంతో కర్నూలు, అనంతపురం వంటి పెద్ద మార్కెట్లలో ధరలు పెరిగిపోయాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరుతోపాటు పలు ప్రాంతాల్లో 15 రోజులకు ముందు కిలో ఉల్లి ధర రూ.7 ఉండగా.. మెల్లగా ఎగబాకి రూ.10కి, ఆ తర్వాత రూ.14కు చేరింది. ఇటీవలి వరకు రూ.17 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.20కి చేరుకుంది. రిలయన్స్ మాల్స్‌లో రూ.22గా వుంది. ఇక రేపటి ధర ఎంతుంటుందో..? వర్షాకాలం తర్వాత కర్ణాటక రాష్ట్రం హుబ్లీ, ధార్వాడ్, బళ్లారి నుంచి ఉల్లి దిగుమతి అయ్యేవరకు ధర పెరుగుతూనే వుంటుందని వ్యాపారులు అంటున్నారు. అలాగే ఉర్లగడ్డ వారం కిందట కిలో రూ.10 ఉంది. ఆ తర్వాత రూ.15 చేరుకుని.. ప్రస్తుతం రూ.25గా విక్రయిస్తున్నారు. దీంతో మళ్లీ మధ్యతరగతి, పేద ప్రజలకు ఉల్లి ధరలు ఘాటెక్కించనున్నాయి.




