Saturday, 7 November 2026

మహాకూటమి గెలిస్తే.. సీఎంను నిర్ణయించేంది రాహులే

 

– కేసీఆర్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే

– మోడీ, కేసీఆర్‌లు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు

– తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేఖ వాతావరణం నెలకొంది

– 75స్థానాలకుపైగా కూటమి విజయం సాధిస్తుంది

– కేటీఆర్‌ను రాజకీయ నాయకుడిగా నేను గుర్తించను

– ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలను మోడీనిర్వీర్యం చేశాడు

– రాఫెల్‌ ఒప్పందంతో అనిల్‌ అంబానికి లక్షకోట్ల వ్యాపారం అప్పగించాడు

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి

– హైదరాబాద్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) : మహాకూటమి గెలిస్తే సీఎం ఎవరన్నది రాహుల్‌ గాంధీయే నిర్ణయిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం విూట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పై మండిపడ్డారు. మోడీ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని, ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పాత నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ రూ. లక్షల కోట్లలో దెబ్బతిందని విమర్శించారు. రాఫెల్‌పై మోదీ ఇప్పటి వరకు నోరు మెదపలేదని మండిపడ్డారు. రాఫెల్‌ ఒప్పందంతో అనిల్‌ అంబానికి లక్ష కోట్ల వ్యాపారం అప్పగించారని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. తన మాట వినని వారిపై మోడీ రాజ్యాంగ వ్యవస్థలను ప్రయోగిస్తున్నారన్నారు. మోడీని ఓడించాలనే లక్ష్యంతో టీడీపీతో కాంగ్రెస్‌ జతకట్టిందని జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే అని జైపాల్‌రెడ్డి అన్నారు. మోడీ, కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే బీజేపీ అభ్యర్ధులు ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బలహీనమైన అభ్యర్ధులను బరిలోకి దింపిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక వాతావరణం నెలకొందని, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఖచ్చితంగా 75 స్ధానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ను ఓ రాజకీయ నాయకుడిగా గుర్తించను, కావున ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించనని తెలిపారు. పద్మాఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాబట్టి ఆమె విషయంలో మినహాయింపు నిచ్చామని జైపాల్‌ రెడ్డి తెలిపారు.