Tuesday, 3 November 2026

మహానీయుల చరిత్రను అన్ని వర్గాల వారు తెలుసుకోవాలి..జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డిబాబు ఒక ఆశాజ్యోతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, ఏప్రిల్ 5 డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్మహనీయుల చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, వారి స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.
బుధవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకునిపట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్,  వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నటరాజ్ థియేటర్ పక్కన కల్వకుంట రోడ్డులో  నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ  జయంతి కార్యక్రమంలో  పాల్గొన్నారు.
ఈ సందర్భంగాజడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందాలని, ఆ దిశగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారు.మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని  ఆమె పిలుపు నిచ్చారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప ప్రజ్ఞాశాలి, ఒక ఆశాజ్యోతి, అణగారిన వర్గాల గొంతుకని అన్నారు. వారు చెప్పిన సూక్తులు మననం చేసుకుంటూ,వారి బాటలో ముందుకు వెళ్లాలన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయసాధకుడిగా, విలక్షణ వ్యవహార దక్షత తో అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించారని, యోధుడిగా పని చేశారని కొనియాడారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవస్థ నిర్మాణంకు లిఖిత రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి అయితే, ఆ వ్యవస్థ ద్వారా పాలన ఎలా చేయాలి, ఈ పాలన ద్వారా అభివృద్ధి ఎలా రావాలి అని నేర్పించిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. హరిత విప్లవాన్ని తీసుకువచ్చిన గొప్ప ధీశాలియని, ఈరోజు మనం ఆహార కొరత లేకుండా ఎగుమతులు చేస్తున్నామంటే వారిప్రజ్ఞ, దూరదృష్టి అని తెలిపారు. అభివృద్ధికి నాంది వేసిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, చైతన్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అప్పుడే బాబు జగ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి అర్పించినవారమవుతామన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు  అందేలా చేయూతనిస్తూ అభివృద్ధికి దోహదం చేయాలని , అణగారిన బడుగు వర్గాలకు చేయుతనిచ్చి ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
అందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, మహనీయులు సాధించిన విజయాలు వారి ఆశయాలను ప్రజలకు తెలియజేస్తు  ప్రభుత్వం అధికారికంగా మహనీయుల జయంతులను నిర్వహిస్తుందన్నారు.  బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా అనేక విజయాలు సాధించారని, ఆయన ఆశయాలను అందరూ ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు.  ప్రతి మనిషి ఉన్నతికి చదువే మంచి సాధనమని,విద్యార్థులు విద్యపై దృష్టి సారించి, ఉన్నతంగా ఎదగాలన్నారు.
అంతకు ముందు వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు.
కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, టి ఎస్ ఎస్ కళాకారుల కళాజాత కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఇంచార్జి అధికారి జగదీష్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు,  ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,ఉద్యోగులు ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.