మహిళలపై దాడులు అరికట్టటంలో విఫలమైన పాలకులు
* 28,29 లలో మహా.బాదులో సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
* పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములమ్మ నిర్మల
టేకులపల్లి, జనవరి 16( జనం సాక్షి): దేశవ్యాప్తంగా పసిపిల్లలు మొదలు పండు వృద్దుల వరకు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళలపై అత్యాచారాల నివారణకు ఉన్న చట్టాలను అధికార పార్టీలు,రాజకీయ పార్టీల నేతలకు అనుగుణంగా ఉపయోగించుకొని మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయాయని ప్రగశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్తి రాములమ్మ, ఏ.నిర్మల అన్నారు. మహిళలపై దాడులను అరికట్టలేని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం టేకులపల్లి మండల మహాసభ సోమవారం నోముల కళావతి, భూక్య చిన్ని అధ్యక్షతన మండలంలోని భద్దుతండాలో జరిగింది. ఈ సభలో వారు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు గత 25 సంవత్సరాలుగా పార్లమెంట్ గడప దాటి బయటకు రావడంలేదని పార్లమెంటులోని అధికార,ప్రతిపక్ష పాలకవర్గ పార్టీల మహిళా వ్యతిరేకత ఇందుకు కారణమని వారు విమర్శించారు.మహిళల కట్టుబొట్టు చదువు ఉద్యోగం అన్నింటిని నియంత్రించే విధంగా స్త్రీలను ఇంటికే పరిమితం చేసేందుకు హిందుత్వ శక్తులు కోరుకుంటున్నాయని, మహిళల వేషధారణపై పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రులు బిజెపి,ఆర్ఎస్ఎస్ నేతలు అడ్డమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారని,మహిళలపై దాడులను అత్యాచారాలను సమర్థించే విధంగా మతోన్మాద శక్తుల ఆచరణ కొనసాగుతుందని వారు ఆరోపించారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్ చట్టం కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింత లాలమ్మ, తొటకూరి చిట్టమ్మ ,పెనక లక్ష్మి,జార లక్ష్మి,మంగ,అలివేలు తదితరులు పాల్గొన్నారు.




