– డీజీపీని కలిసిన కోమటిరెడ్డి, సంపత్
హైదరాబాద్, మే24(జనం సాక్షి) : మాకు ప్రాణ హాని ఉందని, వెంటనే తమకు గన్‌మెన్‌లు కేటాయించి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లు గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. హైకోర్టు తమ శాసనసభ్యత్వాలను పునరుద్దరిస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు తమకు గన్‌మెన్‌లను కేటాయించలేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి పశువులను బాదినట్లు బాదుతున్నారని వారు డీజీపీకి వివరించారు. రాజకీయంగా దుర్మార్గంగా కాంగ్రెస్ నేతలను అణగదొక్కాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. అనవసరమైన కేసులు బనాయిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తమపై, తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఓ ప్రభుత్వం చెబుతుందని, మరో పక్క వారిపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ నేతలపై కేసులు బనాయిస్తుందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తీరు మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మాకు ప్రాణ హాని ఉంది… రక్షణ కల్పించండి




