సబ్జెక్టుతో పాటు వివిధ అంశాల్లో పట్టుండాలి
ఉద్యోగాల్లో అర్హతల తీరు మారుతోంది
హైదరాబాద్,ఫిబ్రవరి15(జనంసాక్షి): ఇంజినీరింగ్ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ప్రాంగణ ఎంపికల్లో కొలువును సాధించాలి. లేకుంటే.. బయటకొచ్చాక ఏడాదిలోగా ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పటివరకూ కంపెనీలు విద్యార్థిని తాజాగానే గుర్తిస్తాయి. ఏడాది దాటిన తర్వాత విద్యార్థులకు అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అందుకే చాలామంది ఏ కొలువూ దొరక్క.. పెద్దపెద్ద షాపింగ్‌మాళ్లు, బీపీవో, కాల్‌సెంటర్ కొలువుల్లో చేరిపోతున్నారు. చివరికి ప్యూన్ ఉద్యోగం పడినా.. వందల మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు పోటీపడే పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. క్యాంపస్ ఎంపికలో కొలువులు సాధించలేకపోతున్న వారిలో కేవలం ఐదు శాతమే సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ అనుబంధ కొలువుల్లో స్థిరపడు తున్నారు. ఐదు శాతం మంది పైచదువుల కోసం వెళ్లిపోతున్నారు. మిగతా వారంతా.. చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోని అంశాలపైనా ఇంజినీరింగ్ విద్యార్థులకు పూర్తిగా పట్టుండాలి. కొలువులు ఇచ్చే సంస్థల వరకూ వెళ్లి అవకాశాన్ని కోరాటంటే.. ఇంజినీరింగ్‌లో వచ్చే పర్సంటేజీ మార్కులుండాల్సిందే. కొన్ని సంస్థలు 80 శాతం, మరికొన్ని 70 శాతం మార్కులుంటేనే మౌఖిక పరీక్షలకు హాజరవ్వాలని కంపెనీలు సూచిస్తున్నాయి. అందుకే సంస్థల వరకూ చేరాలంటే.. కచ్చితంగా పరీక్షల మార్కులూ ప్రధానమే. ఇతర నైపుణ్యాలపై దృష్టి సారించి.. అసలు విషయాన్ని మరచిపోయే విద్యార్థులు ఈ సంగతీ గుర్తుంచుకోవాలి. భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో సేవలు, వస్తు వినిమయ, ఉత్పాదక రంగాలు కలిపి 55 శాతం ఉండగా.. 45 శాతం సాఫ్ట్వేర్ రంగం పాత్ర ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పరిమాణామాల నేపథ్యంలో సాఫ్ట్వేర్ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఉద్యోగాలు భారీగా తగ్గిపోయాయి. మనపై దాని ప్రభావం నేరుగా పడింది. గతంలో 80-90 శాతం ప్రాంగణ ఎంపికలు జరిగే కళాలల్లో ప్రస్తుతం 40 శాతం లోపు పడిపోయాయి. 40 శాతం ప్రాంగణ నియామకాలు జరిగే కళాశాలల్లో పరిస్థితి 10శాతం లోపునకు పడిపోయింది. ఫలితంగా విద్యార్థుల మధ్య పోటీ తీవ్రంగా మారిపోయింది. విభిన్నంగా ఆలోచించి అన్ని అంశాలపై పట్టుసాధించిన విద్యార్థులే నెగ్గుకు రాగలుగుతున్నారు. మనిషి చేసే పనులన్నింటినీ యంత్రాలతో చేయించుకునే పరిస్థితి పెరగడంతో ఈ రంగంలో కొలువులు తగ్గుతున్నాయి. ఇదే సమయంలో ఐవోటీ, బిగ్‌డాటా, డాటా ఎనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిలో ప్రస్తుతం కొలువులు
పెరుగుతున్నాయి. వీటిపై పట్టు సాధించిన విద్యార్థులు సులువుగా కొలువులు సాధిస్తున్నారు. కళాశాల ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించలేని విద్యార్థులు బయటకొచ్చి కొలువుల కోసం ప్రయత్నించడం ప్రస్తుతం ఇబ్బందికరంగానే మారుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకే చెప్పి.. కొత్తవారిని చూడాలని సూచిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్న కళాశాలల విద్యార్థులు మాత్రమే ప్రస్తుతం విజయవంతమవుతున్నారు. కళాశాలలు గతంలో మాదిరిగా ఏదో సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాం, ఆంగ్లంలో ప్రాథమిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామంటే.. చాలదు. ఇలాంటి కళాశాలల విద్యార్థులు పోటీలో నిలబడలేరు. అందుకే కంపెనీలకు అనుగుణంగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే పద్ధతిని ఆశ్రయించాల్సిన సమయమిది. ప్రస్తుతం ప్రాంగణ ఎంపికలకు వస్తున్న సంస్థల అవసరాలకు తగ్గట్టుగా, విద్యార్థులకు లోతుగా తర్ఫీదు ఇస్తున్న కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా వెతికిచూసినా.. కేవలం ఐదు శాతానికి మించి లేవు. మిగతా అన్ని కళాశాలలూ మూసధోరణిలోనే నేటికీ సాగుతున్నాయి. గతంలో మాదిరిగానే.. పాఠ్యపుస్తకాల్లోని
అంశాలకు అదనంగా, కొంచెం ఆంగ్లం, సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పించి విద్యార్థులను బయటకు వదిలేస్తున్నాయి. ఇలాంటి కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమకు తాముగా సాధన చేస్తే విజయం సాధించేందుకు అవకాశముంటుంది. విద్యార్థులు కళాశాలలో ఉన్నప్పుడు జాలీగా గడిపేస్తూ..కొత్తగా మళ్లీ జావా, సీఎస్, డాట్నెట్, సి వంటివి నేర్చుకుంటూ ఉంటారు. అదేదో కళాశాలలో ఉన్నప్పుడే హాయిగా నేర్చుకుంటే మళ్లీ అక్కడ కోర్సుల్లో తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉండదు. అక్కడ శిక్షణ పొందుతూ పేపర్లలో పడే కొలువుల కోసం దరఖాస్తులు చేసుకుంటూ ఏళ్ల తరబడి గడిపేస్తున్న విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటోంది.
పోటీ ప్రపంచంలో కొలువులకు పోటీ బాగా పెరిగింది. విద్యార్థులు ఎంత చదివినా కొలువులు దక్కని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందరికంటే ఏదో ఒక ప్రత్యేక అర్హత సాధించడం ముఖ్యం. సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం దక్కుతోంది. ఉదాహరణకు ఇద్దరు విద్యార్థులకు విద్యార్హతలు సమానంగా ఉన్నప్పుడు రక్తదానం చేసిన ధ్రువపత్రాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘటనలు కలిసొస్తాయి. అన్ని అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్న కంపెనీల అవసరాలను గుర్తించి వాటిల్లో ప్రావీణ్యం పొందాలని నిపుణులు సూచిస్తునారు.
మారుతున్న ఇంజనీరింగ్ విద్య




