Thursday, 5 November 2026

మార్కెట్ కమిటీ చైర్మన్ మైనార్టీలకు దక్కెనా? ఆశలు పెంచుకున్న పార్టీ నాయకులు

బిచ్కుంద జనవరి 17 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, మద్నూర్, బిచ్కుంద మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి నేటి వరకు ముస్లిం మైనార్టీలకు ఒక్కసారి కూడా దక్కలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ముస్లిం మైనారిటీలు ఈ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఈసారైనా మూడు మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మైనారిటీ నాయకులకు దక్కుతుందని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఆయా వర్గాల వారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు వహించడం జరిగింది. కానీ జుక్కల్ నియోజకవర్గంలో నామినేట్ పదవైన మార్కెట్ కమిటీ చైర్మన్ మైనార్టీ వర్గాల వారికి ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా అవకాశం ఇవ్వలేదు. జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ పిట్లం బిచ్కుంద మార్కెట్ కమిటీలు మూడు ఉన్న ఇప్పటివరకు ఎక్కడ కూడా మైనారిటీ వర్గానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కేటాయించిన దాఖలాలు లేవు. అధిక మైనారిటీ ఓట్లతో గెలిచే జుక్కల్ ఎమ్మెల్యే సీటు కనీసం ఆ వర్గానికి ఒక్క నామినేట్ పోస్ట్ ఇచ్చి వారికి గౌరవ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎన్నికలు వచ్చాయంటే మైనారిటీ ఓట్లపై ఆశలు ఎక్కువగా పెట్టుకుని ఆయా పార్టీలు తమ ప్రాబల్యం కొనసాగిస్తున్నారు. గెలిచిన తర్వాత మరో ఎన్నికల వరకు వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా కాలం గడుపుతున్నారు. మైనార్టీ నాయకులు పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న నామినేట్ పోస్టులు ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈసారైనా మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. తరాలు మారిన తలరాత మారలేదు అన్న చందంగా మైనారిటీల పరిస్థితి తయారయింది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఆలోచించి మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవిని మైనార్టీ సభ్యులకు ఇవ్వాలని జనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.