Thursday, 5 November 2026

మార్చి 20 న రాష్ట్రవ్యాప్తంగా కామ్రేడ్ ఠానూ నాయక్ వర్ధంతి

 సభలు.మార్చి 20 న రాష్ట్రవ్యాప్తంగా కామ్రేడ్ ఠానూ నాయక్ వర్ధంతి సభలు.
-తెలంగాణ గిరిజన సంఘం పిలుపు.
రాష్ట్ర ప్రభుత్వం ఠానూ నాయక్ విగ్రహాన్ని  ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలిగాంధారి మార్చి జనం సాక్షిభూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని జరిగిన విరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరమరణం పొందిన గిరిజన యోధుడు కామ్రేడ్ జాటోత్ ఠానూ నాయక్ 73 వ వర్ధంతి సభలు మార్చి 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాలతో పాటు తండాలలో  నిర్వహించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగే వర్ధంతి సభల్లో గిరిజనులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1944 నుండి 1951 వరకు సాగిందని అన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ఈ పోరాటం నిజాం నిరంకుశత్వాన్ని సమాధి చేసి, రజాకార్లు ,దొరలు, దేశ్ ముఖ్ లు ఆగడాలను  అంతమందించిందని తెలిపారు. ఫలితంగా 13 లక్షల ఎకరాల సాగు భూములను కమ్యూనిస్టులు పేదలకు పంచగలిగారని తెలిపారు. ఈ పోరాటంలో ఎందరో పోరాట వీరులు, యోధులు మరణించారని వారి త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. అటువంటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లంబాడీ గిరిజనుల తిరుగుబాటు మరింత ప్రేరణ ఇస్తుందని తెలిపారు. జనగామ ప్రాంతంలోని ధర్మపురం, ముండ్రాయి చుట్టుపక్కల తండాలలో  తమ భూములను సాగు చేసుకుంటు జీవిస్తున్న లంబాడీ గిరిజనుల భూములను విసునూరు రామచంద్రారెడ్డి , కటారు నర్సింగరావు వారి గుండాలు ఆక్రమించడంతో తిరుగుబాటు ప్రారంభమైందని తెలిపారు. తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న కామ్రేడ్ జాటోత్ ఠానూ నాయక్  ఆరుగురు అన్నదమ్ములు ఆ ప్రాంత దొరలను కంటిమీద కునుకు లేకుండా చేశారని తెలిపారు. మరింత రెచ్చిపోయిన రామచంద్రారెడ్డి , నర్సింగరావు, బాబు దొర వంటి దొరలు ఎలాగైనా ఠానూ నాయక్ కుటుంబాన్ని మట్టు పెట్టడం కోసం కిరాయి గుండాలు, నిజాం పోలీసులను వెంటబెట్టుకొని తండాల మీద పడి గిరిజన మహిళలు, వృద్ధులను సైతం మంటల్లో తగులబెట్టి భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. దొరలను చంపాలని బయలుదేరిన లంబాడి గిరిజనులకు ఒకరోజు బండిలో దాక్కొని పరారవుతున్న బాబు దొరను బయటికి లాగి చంపడంలో ఠానూ నాయక్ తమ్ముడు దర్గ్యా నాయక్ ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు. మరింత రెచ్చిపోయిన దొరలు ఠానూ నాయక్   అన్నదమ్ములైన నలుగురిని ఒకే చోట పట్టుకొని వారి చితిని వారి చేతనే పేర్పించి వారే నిప్పు అంటించుకునే విధంగా చేసి అతి కిరాతకంగా చంపారని అన్నారు. దొరలను ముప్పు తిప్పలు పెట్టిన ఠానూ నాయక్ ను ఎలాగైనా చంపాలని కటారు నర్సింగరావు అతని  గుండాలను, అప్పటికే సాయుధ పోరాట వీరులను చంపుకుంటూ వస్తున్న  భారత సైన్యాలను  వెంటబెట్టుకుని తీవ్రంగా గాలించి ద్రోహి ఇచ్చిన సమాచారంతో 1950 మార్చి 20వ తేదీన ముండ్రాయి తండాలో పట్టుకొని బంధించారని అన్నారు. అక్కడే బండి చక్రానికి కట్టి మొక్కలు అయ్యే వరకు ఈడ్పించి  అతి క్రూరంగా చంపడంలో దొరలు ముఖ్యపాత్ర పోషించారని తెలిపారు.ఠానూ నాయక్ చనిపోతున్న తుది గడియల్లో సైతం ఆయన పెదాలపై కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి శత్రువు అంతం చూడాలి అన్న నినాదాలు ప్రతిధ్వనించాయని అన్నారు. అంతటి పోరాట యోధుడి చరిత్రను నేటి గిరిజనులు తెలుసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఠానూ నాయక్ చరిత్రను భావితరాలకు అందించే విధంగా హైదరాబాదులో మ్యూజియంతో   పాటు ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మార్చి 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఠానూ నాయక్ 73వ వర్ధంతి సభలలో గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు