ధర్మపురి మున్సిపల్ కమిషనర్ మీడియాకు తెలిపిన విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని కేటీఆర్ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు పురపాలక శాఖ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణను ప్రకటించింది. మార్చ్ 8వ తేదీన మహిళా దినోత్సవం రోజున ప్రారంభం అయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించనున్నది. ముఖ్యంగా పురపాలక శాఖ కార్యక్రమాల్లో కీలకపాత్ర వహించే పురపాలికల్లో వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.




