హన్మకొండ ప్రతనిది జూన్ 29 జనంసాక్షిపరకాల మున్సిపాలిటీ పరిధిలోని దామేర చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ… పరకాల పట్టణంలోని దామెర పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పరకాల పట్టణంలో 8 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులు జరగగా మినీ ట్యాంక్ బండ్ పనులకు 3.6 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని మరింత ప్రజలు ఆహ్లాదకరంగా ఉండటానికి చెరువులోని చెట్లను తొలగించాలని అధికారులు ఆదేశించారు. అవసరమైతే స్పీడ్ బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న పెద్దమ్మ తల్లి సమీపంలో గౌడ సంఘం నాయకుల అభిప్రాయం మేరకు సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదన తయారుచేసి త్వరలోనే పనులు చేపట్టాలని అధికారులకు చెప్పారు. పరకాల నియోజకవర్గం లో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి కూడా కళ్ళు కనబడని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. ప్రతిపక్ష నాయకులు చిల్లర ఆసత్య మాటలు మానుకొని… చేస్తున్న అభివృద్ధికి తోడ్పాటు చేయాలని లేకపోతే అసత్య మాటలు మానుకోవాలని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గం లో దాదాపు అన్ని గ్రామాలలో, వీధులలో రోడ్ల పనులు పూర్తి అయ్యాయని మిగతా కొద్దో గొప్ప ఉంటే అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. సిఎం కేసీఆర్ గారి చొరవతో నియోజకవర్గంలో గ్రామాలకు,మండలాలకు అనుసంధానంగా ఉండే రహదారులకు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం జరిగిందని అన్నారు.త్వరలోనే శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభం చేసుకోబోతున్నట్లు తెలిపారు.ఈ రహదారులు పూర్తి అవుతే ప్రజలకు,రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గానికి మరింత అభివృద్ది చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా




