Tuesday, 3 November 2026

మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాల అమలు చేయాలి.

మఖ్తల్ జూన్ 24(జనంసాక్షి)మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని మిషన్‌ భగీరథ కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక నాయకులు ఆంజనేయులు, మహేష్, ఏ. జీ భుట్టో అన్నారు. శనివారం మక్తల్ పట్టణంలోని సత్య సాయి దేవాలయ అవరణ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్యవేదిక ఆద్వర్యంలో ఈ నెల 27 హైదరాబాద్ లోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఇఎన్‌సి) కార్యాలయం వద్ద తలపెట్టిన ముట్టడి కార్యక్రమం పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు కార్మికుల శ్రమను దోచుకొంటూ అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. కనీస వేతనాలు, కార్మిక హక్కులు అమలు కాకున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం. 60ని విడుదల చేసి స్కిల్డ్‌ కార్మికులకు రూ.22,750/ లు, సెమీ స్కిల్డ్‌ కార్మికులకు రూ.19,500/ లు, అన్‌ స్కిల్డ్‌ కార్మికులకు రూ.15,600/ లు అమలు చేస్తున్నప్పటికీ మిషన్‌ భగీరథలో మాత్రం కాంట్రాక్టర్లు కన్‌ష్ట్రక్షన్‌ పేరుతో కార్మికులకు అన్యాయం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు చేసిన కాంట్రాక్టర్లు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి వాటిని అమలు చేయకుండా తప్పించుకు తీరుగుతున్నారని అన్నారు. ఈనెల 27న ఇఎన్‌సి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బ్రహ్మానందం, లక్ష్మయ్య, శ్రీనివాస్ శెట్టి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్ రెడ్డి, శివరాజ్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.