మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి.
-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి.
-టిపిసిసి ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్17(జనంసాక్షి):
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాషరావు డిమాండ్ చేశారు.కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో మిషన్ భగీరథ పంపు హౌస్ దగ్గర జేఏసీ అధ్వర్యంలో మిషన్ భగీరథ కార్మికులు రెండు రోజుల నుండి చేపట్టిన ధర్నా కార్యక్రమంలో శనివారం పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా అభిలాష్ రావు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం గాలికి వదిలేయడం చాలా బాధాకరమన్నారు.సగటు మనిషికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నీరు లేనిదే కాలం గడవదని, అలాంటిది మిషన్ భగీరథ కార్మికులు పడే బాధలను పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు.మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం ప్రతి కార్మికునికి కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అదే విధంగా ఆరోగ్య సమస్యలకై హెల్త్ కార్డులను వెంటనే పంపిణీ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే పశువులకు మరియు గేదెలకు గుర్తుపెట్టు కోవాడానికి ఒక ఐడి కార్డును ఇస్తున్నారని అయితే ప్రతి రోజూ ప్రజల కోసం పని చేసే కార్మికులకు మాత్రం గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాటపై ఎందుకు నిలబడడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతన చట్టం అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛ జలాలను అందిస్తున్న భగీరథ కార్మికులకు స్వచ్ఛమైన ఆహారం ఆరోగ్యం ఉండాలంటే కనీసం వేతన చట్టం అమలు చేయాలని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి ఉద్యోగికి 26వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. లేనిచో వచ్చే ఎన్నికల్లో పాలకవర్గాలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంటే శివన్న,జిల్లా జనరల్ సెక్రెటరీ రఫీ ఉద్దీన్,రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ పరమేష్ ,కొల్లాపూర్ టౌన్ ఉపాధ్యక్షుడు బాబా, ఎల్లూరు గ్రామ అధ్యక్షుడు పరశురాం యాదవ్ ,కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




