Monday, 2 November 2026

ముంజంపల్లిలో బండెల్లిపోతుందే చెల్లెలా పాట సక్సెస్ మీట్

ముంజంపల్లిలో బండెల్లిపోతుందే చెల్లెలా పాట సక్సెస్ మీట్..

-◆◆◆◆◆ గాయకుడు, నటుడు కైరి తిరుపతి గౌడ్ ను సన్మానించి, అభినందనలు తెలిపిన యూనిట్ సభ్యులు..

మానకొండూరు, ఆర్ సి, డిసెంబరు 31 ( జనం సాక్షి)

 

కైరి మ్యూజిక్ యూట్యూబ్ చానల్ ద్వారా బండెల్లిపోతుందే చెల్లెలా పాట ఇటీవల విడుదలై అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొందడంతో శనివారం మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ నిర్వహించారు. మంత్ర సినిమా నిర్మాత, కరీంనగర్ పదహరొవ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ ఈ సక్సెస్ మీట్ కు హాజరై గాయకుడు, నటుడు కైరి తిరుపతి గౌడ్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ పి ఆర్ ఓ కైరి తిరుపతి గౌడ్ తన గానంతో పాటు , మనసునకు హత్తుకునేలా అభినయించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతూ, అన్నా చెల్లెళ్ళ అనురాగ బంధాలు బలహీన పడుతున్న నేటి సమాజంలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటి చెప్పిన ఈ బండెల్లిపోతుందే చెల్లెలా వీడియో పాట అన్నా చెల్లెళ్లను ఎందరినో దగ్గర చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒక అన్నయ్య తన చెల్లెలి పెళ్లి చేసి వారి చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ అత్త గారింటికి సాగనంపే ఇతివృత్తంతో తీసిన ఈ వీడియో పాట ప్రేక్షకుల మనసులకు హత్తుకొని కన్నీళ్లు పెట్టించాయన్నారు. కైరి మ్యూజిక్ యూట్యూబ్ చానల్ కొత్త దైనప్పటికి ఒకే ఒక్క పాటతో కేవలం ఇరవై రోజుల్లో మాణిటైజేషన్ కావడమే కాకుండా రెండు లక్షల వ్యూస్ వైపు దూసుకెళ్లడమే ఈ పాట విజయానికి నిదర్శనమన్నారు.
కైరి మ్యూజిక్ ద్వారా మరెన్నో అద్భుతమైన వీడియోలు రావాలని ఇందుకోసం తిరుపతి గౌడ్ తీసే ప్రతి పాటకు నిర్మాతలుగా వ్యవహరిస్తామని బోనాల శ్రీకాంత్ , యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ అన్నారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం జగత్ పాల్, తారక్,సత్యనారాయణ, బాల నటులు శశాంక్, శ్రీనిధి, రజిత తదితరులు ఈ సక్సెస్ మీట్ కు హజరయ్యారు.