సార్క్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి
ప్రధాని నరేంద్రమోడీ
ఖాట్మండు, నవంబర్ 26 (జనంసాక్షి) : ముంబై దాడులు ఒక చేదు జ్ఞాపకం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సార్క్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. పరస్పర సహకారంతో కలిసి నడస్తున్న పరిపుష్ట ప్రజాస్వామ్య దేశాల సమాహారం సార్క్ అని మోదీ అభివర్ణించారు. 18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు నేపాల్‌లోని ఖాట్మండులో బుధవారం ప్రారంభమైంది. సదస్సులో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే … మరో వైపు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. మేము భారత్ గురించి ఎలాంటి కలలు కంటున్నామో.. సార్క్ కూడా అలాగే ఉండాలన్నది మా ఆకాంక్ష అని పేర్కొన్నారు. మన యువత గుండెల నిండా విశ్వాసంతో ఉంది.. యువతను సవ్యదిశలో నడిపించాల్సి ఉందన్నారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటే మనమే గొప్ప మార్కెట్ సృష్టించుకోవచ్చన్నారు. సార్క్ దేశాల చిన్నారులకు టీబీ, హెచ్‌ఐవీ వ్యాక్సిన్లు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. సార్క్ దేశాల నుంచి రోగులకు తక్షణమే వైద్య వీసాలు ఇంచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, గొప్ప మార్కెట్ ఉంది. అయినా ప్రజలు ఆశించిన స్థాయిలోముందు కెళ్లలేక పోతున్నామన్నారు. మన మధ్య రోడ్డు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాలి, విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. సార్క్ దేశాల కోసం ఆవిష్కరించిన ఉపగ్రహమే అందరి పట్ల మాకున్న గౌరవానికి సూచిక అని మోదీ స్పష్టం చేశారు. సురక్షితమైన, బలమైన దక్షిణాసియాను భారత్ కలకంటోందని తెలిపారు. భారత వాణిజ్య రాజధాని ముంబయిలో 2008 నవంబరు 26న ఉగ్రవాదుల దాడులు జరిగాయి. ఈ దాడులు జరిగి నేటికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లోని కాఠ్‌మండూలో 18వ సార్క్ సమావేశంలో మాట్లాడుతూ ముంబయి 26/11 దాడులను గుర్తుచేశారు. ఆనాటి దాడుల బాధను భారత ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. సార్క్ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్థాన్, మాల్దీవుల దేశాధినేతలు ఉన్నారు. 2008 ముంబయి దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారని మోదీ గుర్తుచేశారు. సార్క్ దేశాలకు మూడు నుంచి అయిదేళ్ల బిజినెస్ వీసా, అలాగే భారత్‌కు వైద్య సదుపాయం కోసం వచ్చే రోగులకు వెంటనే వీసా సౌకర్యం కల్పిస్తామని మోదీ పేర్కొన్నారు. సార్క్‌లోని ప్రతి దేశం గౌరవంగా ప్రపంచం ముందు తలెత్తుకుని నిలవాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. దక్షిణాసియాలో శాంతికి ఆఫ్ఘనిస్థాన్ కట్టుబడి ఉందని ఆదేశ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ స్పష్టంచేశారు.





