Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ

 

:- రైతులకు ఉచిత విద్యుత్ ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

:- అప్పట్లో 33 /11 కెవి సబ్ స్టేషన్లు 18 ప్రస్తుతం 32

:- పవర్ ట్రాన్స్ఫార్మర్లు 30 ప్రస్తుతం 57

:- విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 2826 ఉండగా తెలంగాణ వచ్చాక 6,971

:- 38వేల గృహ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 70000 గృహ కనెక్షన్లు – ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూన్ 5 : సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో విద్యుత్ ప్రగతి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ

రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల లో విద్యుత్ శాఖ రైతులకు ప్రజలకు మరింత చేరువైందన్నారు. నేడు కరెంటు లేకపోతే ఏ పని చేయలేమని, ప్రతి ఒక్కరు కరెంటు పై ఆధారపడి ఉన్నందున నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది చేస్తున్న కృషికి ప్రశంసించారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ శాఖ పనితీరు మెరుగుపడిందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రూ.493 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ ,పోల్స్, లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా విద్యుత్ సరఫరాలో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాత పోల్స్ తొలగించడం, విద్యుత్ లైన్లు, స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఐదు లక్షల ఎకరాల వరకు సాగునీటి వినియోగానికి విద్యుత్ వాడుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ

గత తొమ్మిది సంవత్సరాలలో విద్యుత్ వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలియజేశారు. అప్పట్లో 33 /11 కెవి సబ్ స్టేషన్లు 18 ఉండేవని ప్రస్తుతం 32కు పెరిగాయి అన్నారు. గతంలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు 30 ఉండగా ప్రస్తుతం 57కు పెరిగాయని అన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 2826 ఉండగా తెలంగాణ వచ్చాక 6,971 మంజూరు చేశామని తెలిపారు. 38వేల గృహ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 70000 గృహ కనెక్షన్లు ఉన్నాయన్నారు. అలాగే విద్యుత్ లైన్లు విద్యుత్ స్తంభాలు భారీగా పెరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. రిజర్వాయర్ల ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోరు మోటార్ల వినియోగం పెరిగిందని డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా నిరంతరం జరుగుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో వ్యవసాయానికి, పరిశ్రమలకు లిఫ్ట్ ఇరిగేషన్లకు విద్యుత్ సరఫరా నిరంతరంగా జరుగుతున్నదని తెలిపారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి విద్యుత్ శాఖ అధికారులపైనే ఉన్నదని నిరంతర విద్యుత్ కొరకు పాటుపడుతున్న సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్ ఈ భాస్కర్ మాట్లాడుతూ

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అభివృద్ధి సాధించిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో సోలార్ జల ఇంధన ప్రాజెక్టుల ద్వారా గతంలో 7778 మెగా వాట్లు విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రస్తుతం 18567 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో 27 లక్షల మంది రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గత తొమ్మిదేళ్ల విద్యుత్ రంగం సాధించిన అభివృద్ధి కార్యక్రమాలపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, గ్రంథాలయ చైర్మన్ రామన్ గౌడ్, మార్కెట్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు , విద్యుత్ ఏ ఈలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.