Thursday, 5 November 2026

ముగిసిన ‘విజయదశమి’ వేడుకలు..

 హైదరాబాద్ : విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులూ అమ్మవారిని నిష్ఠతో పూజించిన భక్తులు.. చివరి రోజు మహిషాసుర మర్దని దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. దేవీ దర్శనం కోసం భక్తులు ఆలయాలకు భారీగా తరలి వచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతరం సాయం సంధ్యవేళ జమ్మి వృక్షం వద్దకు చేరిన భక్తులు, పాల పిట్టను చూసి ఆనందించారు.తెలంగాణ జిల్లాల్లోనూ విజయదశమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్‌ సైదాబాద్‌లో దుర్గామాత ఉత్సవమూర్తిని అంబారీపై ఊరేగించారు. మహిళల కోలాటాలు, దాండియా నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పలు ఆలయాల్లో ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతి దేవిని అశ్వవాహన రథంపై ఊరేగించారు. శోభాయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భ్రమరాంభికా దేవి ఆలయంలో మహాగౌరి అవతారంలో ఉన్న ఉత్సవ మూర్తిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మాతను వేలాది భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గంగా పార్వతీ సమేత మల్లేశ్వర ఉత్సవమూర్తులు హంస వాహనంపై కృష్ణానదిలో విహరించారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *