Monday, 2 November 2026

మున్నూరు కాపు సత్రం భవన నిర్మాణానికి సహకరించండి

 

 

 

 

 

 

 

 

 

వరంగల్ బ్యూరో, ఏప్రిల్ 29 (జనం సాక్షికొమురవెల్లి లోని శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి మున్నూరు కాపులంతా సహకరించాలని సత్రం చైర్మన్ ఉప్పు రవీందర్ పటేల్ కోరారు. ఈ మేరకు వరంగల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఉప్పు రవీందర్ పటేల్ ఎఫ్ సి ఐ డైరెక్టర్ గా నాలుగేండ్లు పని చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా ప్రస్తుతం ఉప్పు రవీందర్ పనిచేస్తున్నారు. అదేవిధంగా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ వర్కింగ్ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. కొమురవెల్లి లో మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి రూపాయలు ఒక కోటి యాభై లక్షల విలువగల వెయ్యి గజాల భూమిని కొని ఇచ్చినట్లు చెప్పారు. మే నెల 31వ తేదీన పదివేల మందితో సత్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఉప్పు రవీందర్ తెలిపారు. ఈ ముహూర్తానికి శ్రీ శ్రీ శివ నాగేంద్ర స్వామి కంచి పీఠాధిపతులు వస్తున్నట్లు వివరించారు. సత్రంలో మొత్తం మూడు ఫ్లోర్లలో 60 గదులు సుమారు రూపాయలు ఏడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు చైర్మన్ ఉప్పు రవీందర్ పటేల్ వివరించారు. సత్రం నిర్మాణానికి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆర్థిక సహాయం కోసం అడుగుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా రూపాయలు 10 లక్షలు చెల్లించిన వారికి శాశ్వత ట్రస్టు సభ్యులుగా ఉండే విధంగా చూస్తున్నట్లు రవీందర్ పటేల్ పేర్కొన్నారు. మున్నూరు కాపులంతా ఐకమత్యంతో ఉండి సత్రం భవన నిర్మాణానికి మనస్ఫూర్తిగా సహకరించాలని ఉప్పు రవీందర్ పటేల్ కోరారు.