Thursday, 5 November 2026

మున్సిపల్ కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ పనులు కొనసాగించాలి

– ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర
– వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనుంజయ నాయుడు
హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి): మున్సిపల్ కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేకమంది పేదవారు తమ పిల్లల చదువు నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి స్లమ్ ఏరియాలో నివసిస్తున్నారని వారికి ఉపాధిపథకాన్ని వర్తింపజేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా కొనసాగించేలా ప్రభుత్వం శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది వ్యవసాయ కూలీలు ఉండేందుకు ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారని వారిని గుర్తించి అందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు 5000 రూపాయల పింఛను అందించాలని, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల మాదిరిగా రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యా జీవిత అవసర వస్తువులను సబ్సిడీపై అందించి ఆదుకోవాలన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదని తెలంగాణ ప్రభుత్వ ఏర్పడ్డాక ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని కావున తక్షణమే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని రైతుబంధు, దళిత బంధు, గిరిజన బందు మాదిరిగా వ్యవసాయ కూలీలకు కూలి బంధు పథకాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జడ వెంకన్న, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు యల్లావుల రమేష్, జక్కుల రమణ, జాల భద్రయ్య, గూడెపు మంగయ్య పాల్గొన్నారు.